రైలు ప్రమాద ఘటనలో ఇద్దరి అరెస్ట్
గుంతకల్లు రూరల్ (అనంతపురం జిల్లా): పెనుకొండ సమీపంలోని మడకశిర రైల్వే గేటు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగిన నాందేడ్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించిన కేసులో రైల్వే పోలీసులు బుధవారం ఇద్దరిని అరెస్టు చేశారు. రైల్వే ఎస్పీ సుబ్బారావు తెలిపిన వివరాల మేరకు.. తాడిపత్రికి చెందిన లారీ యజమాని వెంకట సుబ్బయ్య తనకున్న రెండు లారీల్లో గ్రానైట్ రాళ్లను లోడ్ చేసి పంపాడు. లోడ్ తో వస్తున్న మొదటి లారీ సోమవారం ఉదయం నాందేడ్ ఎక్స్ప్రెస్ను ఢీ కొట్టింది.
వెనక నుంచి వస్తూ ఘటనను కళ్లారా చూసిన మరో లారీ డ్రైవర్ దూదేకుల బాషా పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ యజమాని వెంకటసుబ్బయ్యతో పాటు, ప్రమాదాన్ని చూసి కూడా చెప్పకుండా వెళ్లిపోయిన దూదేకుల బాషాను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించగా వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి గుత్తి సబ్ జైలుకు తరలించారు.