బకాయిలు వచ్చేదెన్నడో?
జహీరాబాద్: స్థానిక ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం యాజమాన్యం.. చైరకు బకాయిలను చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఫలితంగా రెతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం సాగు పెట్టుబడుల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీ అమలైతే తిరిగి రుణాలు పొందవచ్చనే ఆశ నీరుకారడంతో.. ట్రైడెంట్ యాజమాన్యమైనా బకాయిలు చెల్లిస్తే పెట్టుబడుల కోసం కొంత ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ అమలవుతుందని ఆశించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్‌రావు అధికారం చేపట్టి వంద రోజులు పూర్తయినా.. రుణమాఫీ అమలు కాక పోవడంతో ఖరీఫ్ పెట్టుబడుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన పరిస్థితి ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టక తప్పడం లేదు. మరో పక్షం రోజులు గడిస్తే రబీ పంటల సాగు కోసం కూడా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉండడంతో చేతిలో చిల్లిగవ్వ లేని రైతులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
కనీసం యాజమాన్యం చెరకు బకాయిలనైనా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తే సౌకర్యంగా ఉంటుందని రైతులు అంటున్నారు. తిరిగి క్రషింగ్ సీజన్ ప్రారంభించేందుకు సమయం దగ్గర పడుతున్నా బకాయిలను చెల్లించే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2013-14 సీజన్‌కు గాను ‘ట్రైడెంట్’ చక్కెర కర్మాగారం 4.65 లక్షల టన్నుల మేర చెరకు పంటను గానుగాడించింది. క్రషింగ్ ప్రారంభం నుంచి యాజమాన్యం పూర్తి బిల్లులను చెల్లించలేదు. క్రషింగ్ సీజన్‌కు గాను యాజమాన్యం టన్నుకు రూ.2,600 ధరను నిర్ణయించింది.
క్రషింగ్ సీజన్ ఆరంభం నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు టన్నుకు రూ.2,400 బిల్లులను చెల్లిస్తూ వచ్చింది. అయితే మిగతా 200 రూపాయలను క్రషింగ్ ముగిసిన అనంతరం చెల్లించడం జరుగుతుందని యాజమాన్యం క్రషింగ్ ఆరంభంలో ప్రకటించింది.
క్రషింగ్ ముగిసి ఆరు నెలలు కావస్తున్నా బిల్లుల బకాయిలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. బకాయిలను ఇంత వరకు రైతులకు చెల్లించలేదు. ఈ బిల్లుల కింద యాజమాన్యం రైతులకు రూ.9.30 కోట్లు బకాయి పడింది. వీటిని చెల్లించే విషయంలో యాజమాన్యం జాప్యం చేస్తోందని రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సాధ్యమైనంత త్వరగా యాజమాన్యం బకాయి పడిన చెరకు బిల్లులను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని బకాయిలు తక్షణమే చెల్లించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు.