జైపాల్‌రెడ్డి పచ్చి అవకాశవాది
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్: రాజకీయాల్లో పచ్చి అవకాశవాది కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీమాంధ్రులను అసభ్య పదజాలంతో వ్యాఖ్యానించడాన్ని ఆయన విజ్ఞతకే వదలి వేస్తున్నామన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే దురాశతోనే ఆయన పక్షపాతంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
అవకాశవాద రాజకీయాలకు స్వస్థి పలకాలని హితవు పలికారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు చూస్తే చదువుకున్న మూర్ఖుడిలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపడమే తమ ఏకైక లక్ష్యమని చెప్పారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజలకు జైపాల్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధనరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయంలో ముగ్గుల పోటీలు
టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీలు, గంగిరెద్దులు, భోగిపళ్లు, గాలిపటాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ముగ్గుల పోటీల విజేతలకు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలుగు మహిళలు నల్లపనేని విజయలక్ష్మి, పానకాల వెంకట మహాలక్ష్మి, ఇందిరా ప్రియదర్శిని, ఎం.విజయ, బి.రమణమ్మ పాల్గొన్నారు.