దున్నవానిపేటలో సాంఘిక బహిష్కరణ
–పాఠశాలలో విద్యార్థులను చేర్పించలేదని ఓ కుటుంబంపై పెద్దల తీర్పు
–ఆ కుటుంబంతో ఎవరు మాట్లాడినా రూ.500 ఫైన్
–పోలీసులు, తహశీల్దార్‌కు ఫిర్యాదుచేసిన బాధిత మహిళ
దున్నవానిపేట (వజ్రపుకొత్తూరు): భర్త విదేశాలలో ఉన్నారు.. ఇద్దరు కుమార్తెలతో కలిసి దున్నవానిపేటలో నివసిస్తున్నాను.. గ్రామంలోని పాఠశాలలో పిల్లలను చేర్పించలేదని తమ కుటుంబాన్ని బహిష్కరించారంటూ గ్రామానికి చెందిన కె. సుజాత సోమవారం వజ్రపుకొత్తూరు పోలీసులు, తహశీల్దార్ కె.వెంకటేశ్వరరావు వద్ద వాపోయింది. ఆమె ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. సుజాత తన పిల్లలిద్దరినీ పలాస మండలం చినబడాంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిస్తోంది. వారిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటూ గ్రామస్తులు ఒత్తిడి తెచ్చారు. విద్యాసంవత్సరం మధ్యలో చేర్పించలేనని, వచ్చే ఏడాది చేర్పిస్తానని విన్నవించింది. దీనిని గ్రామస్తులు పట్టించుకోకుండా కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు. వారితో ఎవరు మాట్లాడినా రూ.500 ఫైన్ వేస్తామని ఆదేశాలు జారీచేశారు. ఇంటికి ఉన్న తాగునీటి కనెక్షన్‌ను కూడా గ్రామానికి చెందిన కేత కూర్మారావు, బి.శ్యామసుందరరావు, బి.భాస్కరరావు, కె.కూర్మారావులు వచ్చి తొలగించారు. ఇంటì æనుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. తనకు రక్షణ కల్పించి, సాంఘిక బహిస్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సుజాత పోలీసులు, తహశీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ తెలిపారు.