ఐ ఫోన్ల పౌచ్‌లో బండరాయి..ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్ : ఐ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు విక్రయిస్తామని, దృష్టి మరలిచి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి, రూ. లక్షా 3 వేల నగదు, లక్షా 57 వేలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ నగర్ డీఐ శంకర్ వివరాల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్ పసంద గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్(31), మహ్మద్ మెహందీ హసన్ (35) గతలో వస్త్రవ్యాపారం చేశారు. నగరంలో దుస్తులు కొని తమ స్వస్థలంలో విక్రయించేవారు. వీరి గ్రామంలో 80 శాతం మంది చోరీలు చేస్తూ జీవిస్తారు.
కాగా, వీరికి వ్యాపారంలో నష్టాలు రావడంతో తాము కూడా అదే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక ఐఫోన్, యాపిల్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి వాటిని పట్టుకొని నగరానికి వచ్చారు. దానిని విక్రయిస్తామని విద్యార్థులకు చూపిస్తారు. డబ్బులు అత్యవసరమై రూ. 40 వేల ఫోన్‌ను రూ. 20 వేలకే విక్రయిస్తున్నామని చెప్తారు. కొనుగోలుదారుల దృష్టి మరల్చి ఐఫోన్ ఉన్న పౌచ్‌ను జేబులో పెట్టుకొని.. దాని స్థానంలో బండారాయి ఉన్న పౌచ్‌ను చేతిలో పెట్టి డబ్బు తీసుకొని ఉడాయిస్తారు. ఇదే విధంగా ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తామని మోసం చేస్తున్నారు.
నిన్న ఉదయం ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన క్రైం ఎస్ రవికుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. అబ్బాస్, హసన్‌ల నుంచి నగదు, బైక్, ల్యాప్‌టాప్, యాపిల్ ఫోన్, ఒక బండరాయి, పది ఖాళీ ఐఫోన్ పౌచ్‌లు స్వాధీనం చేసుకున్నారు.