దుర్గం పోలీసుల మాయాజాలం
కళ్యాణదుర్గం, న్యూస్‌లైన్: పేలుడు పదార్థాలు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన బొలెరో వాహనం అదృశ్యమైందని, ఈ విషయంలో పోలీసులే మాయాజాలం ప్రదర్శిస్తున్నారని పట్టణంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున అనంతపురం నుంచి పేలుడు పదార్థాలతో రాయదుర్గం వెళుతున్న ఏపీ 02 టీఏ 1105 నెంబరు గల బొలెరో వాహనాన్ని అనంతపురం బైపాస్‌లోని చెక్‌పోస్టు వద్ద కళ్యాణదుర్గం పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. అందులో 250 కిలోల పేలుడు పదార్థాలున్నట్లు గుర్తించి, వాహనాన్ని టౌన్ స్టేషన్‌కు తరలించారు.
ఉదయం 9 గంటలకే ఈ వాహనం స్టేషన్లో కనిపించకుండా పోవడంతో ముడుపులు తీసుకుని దానిని వదలివేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై టౌన్ ఎస్రూ. జయా నాయక్‌ను వివరణ కోరగా వాహనంలో పట్టుబడిన పేలుడు పదార్థాలకు బిల్లులతోపాటు, వాటిని తరలించేందుకు అవసరమైన లెసైన్స్ కూడా ఉండడంతో వాహనాన్ని వదలివేసినట్లు తెలిపారు. నకిలీ బిల్లులతో పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు తెలిస్తే సంబంధిత వ్యక్తులను తిరిగి రప్పించి విచారణ చేస్తామన్నారు.