నకిలీ కాల్‌లెటర్లతో నిరుద్యోగులకు టోకరా..
శ్రీకాకుళం: ఉద్యోగాలకు ఎంపికయ్యారని, ట్రైనింగ్ నిమిత్తం కొంత మొత్తం తమ ఖాతాలో జమ చేయాలంటూ నిరుద్యోగులకు కాల్ లెటర్లు వస్తుండటం కలకలం రేపుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లో నిరుద్యోగులకు కాల్‌లెటర్లు రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు పూజారి పురుషోత్తమరావు 2014లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ పోస్టుల ఎంపిక కోసం ఒడిశా రాష్ట్రంలోని ఖుర్దా ప్రాంతంలోని 41బెటాలియన్‌కు హాజరయ్యాడు. సాంకేతిక కారణాలతో ఎంపిక కాలేదు. అయితే జి.డి. కానిస్టేబుల్‌గా ఎంపికైనట్లు రెండు రోజుల కిందట ఐటీబీపీ, ఉదయ్‌పూర్, జమ్మూకాశ్మీర్ చిరునామాతో కాల్‌లెటర్ అందింది. అందులో ట్రైనింగ్ నిమిత్తం రూ.25,000 సెక్యూరిటీ డిపాజిట్‌ను 48 గంటల్లోగా కమాండర్ ఆఫీసర్, అనూప్‌సింగ్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతా నెంబర్ 20273768721కు చెల్లించాలని, వారంలోగా ట్రైనింగ్ ఆర్డర్ అందిస్తామని అందులో పేర్కొన్నారు. లేనిపక్షంలో ఉద్యోగం రద్దు చేస్తామని తెలిపారు.
ఇదే తరహాలో ఆమదాలవలస, బూర్జ తదితర మండలాల నిరుద్యోగులకూ నకిలీ కాల్‌లెటర్లు వచ్చాయి. దీంతో అభ్యర్థులు పోలీసులను సంప్రదిస్తున్నారు. ఇదే విషయమై ఆమదాలవలస సీఐ డి.నవీన్‌కుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ప్రభుత్వ ఉద్యోగాలు కోసం సెక్యూరిటీ డిపాజిట్లు ఎవ్వరూ చెల్లించరని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపినా, నకిలీ కాల్‌లెటర్లు పంపినా, ఫోన్లద్వారా మాట్లాడినా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.