నకిలీ బంగారం విక్రయదారుడి అరెస్ట్
► సీసం ముక్కలకు బంగారం పూత..!
► అమాయకులను మోసగిస్తున్న కర్ణాటక మాయగాళ్లు
సూర్యాపేట: నకిలీ బంగారం విక్రయిస్తున్న వ్యక్తిని సోమవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మొగలయ్య నిందితుడి వెల్లడించారు.
సూర్యాపేట పట్టణానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి పట్టణంలో టైర్ల షాపు నిర్వహిస్తుంటాడు. కొద్ది రోజులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అంజనప్ప శ్రీకాంత్‌రెడ్డికి ఫోన్ ద్వారా తమ దగ్గర తవ్వకాలలో దొరికిన బంగారం ఉందని, దానిని అతి తక్కువ ధరకు మీకు ఇస్తామని చెప్పాడు. పలుమార్లు ఫోన్ ద్వారా సంభాషించుకుని శ్రీకాంత్‌రెడ్డి వద్ద నుంచి ‘5లక్షలు అంజనప్ప తీసుకుని షాంపిల్‌గా కొంత నిజమైన బంగారాన్ని ఇచ్చి వెళ్లిపోయాడు. తన వద్ద ఎక్కువ మొత్తంలో బంగారం ఉందని అందుకు అదనంగా మరో ’ 10లక్షలు కావాలని అడగడంతో శ్రీకాంత్‌రెడ్డి అందుకు అంగీకరించాడు. వెంటనే అంజనప్ప బంగారపు పూత పూసిన సీసం ముక్కలను తీసుకుని సూర్యాపేటకు వచ్చాడు.
కాగా శ్రీకాంత్‌రెడ్డికి వాటిపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్పందించిన పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా అవి నకిలీ బంగారం అని తేలడంతో నిందితుడు అంజనప్పపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా కేసుకు సంబంధించి కర్ణాటకు చెందిన మరో ముగ్గురు నిందితులు చంద్రప్ప, పర్షు, సంతోష్‌లు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో పోలీసు సిబ్బంది కరుణాకర్, కృష్ణ, వెంకన్న, వెంకటేశ్వర్లు, రాజేందర్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.