వివేకంతో ఢీ అంటున్న తప్పాట్టం
తమిళసినిమా: అజిత్ హీరో చిత్రం వస్తుందంటే ఒక మోస్తరు చిత్రాలను కూడా ఆ చిత్ర విడుదల దరిదాపుల్లో విడుదల చేయడానికి ముందుకురారు. అలాంటిది నూతన దర్శకుడు, నవ నిర్మాత కలయికలో కొత్త నటీనటులతో నిర్మించిన చిత్రాన్ని అజిత్ చిత్రానికి పోటీగా విడుదల చేసి పెద్ద సాహసమే చేశారు. ఆ చిత్రమే తప్పాట్టం. గత గురువారం అజిత్ చిత్రం వివేకంతో పాటు విడుదలైన తప్పాట్టం చిత్రానికి మంచి విమర్శలు, ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోందని చిత్ర వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తప్పాట్టం చిత్రం గురించి ఒక లుక్కేస్తే, పబ్లిక్ స్టార్ దురై సుధాకర్ హీరోగా నటించగా ఆయనకు జంటగా డోనా నాయకిగా నటించారు. కోవై జయకుమార్, పేనామణి, కూత్తుపట్టరై తులసి, పేరాసిౖయె లక్ష్మి, రూఫి, పొల్లాచ్చి ఎంకే.రాజా ప్రధాన పాత్రల్లో నటించారు.
నవ దర్శకుడు ముజిపూర్ రహ్మాన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రాన్ని ఆదంబావా నిర్మించారు. 1984లో ఒక కుగ్రామంలో జరిగే కథగా తెరకెక్కించిన తప్పాట్టం చిత్రాన్ని దర్శకుడు చాలా సహజత్వంతో రూపొందించారు. చావులకు డప్పులు వాయించే ఒక యువకుడికి, అతడిని పిచ్చిగా ప్రేమించే అక్క కూతురికి మధ్య ప్రేమ,పెళ్లి, ఈ గ్రామంలో ఒక మోతు బారు రైతు ఇలా సాగుతుంది కథ. కంటపడిన యువతుల్ని కాంక్షించే ఆ మోతు బారి రైతు బారిన కథానాయకి పడుతుంది.ఆమె అతని నుంచి తప్పించుకోవడంతో పాటు అతని చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ పగతో రగిలే ఆ మోతుబారి రైతు ఏం చేశాడు, అందుకు చిత్ర కథానాయకుడి రియాక్షన్ ఏమిటీ? తదితర ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రం తప్పాట్టం. చాలా చిన్న చిత్రంగా నిర్మించిన తప్పాట్టంకు మంచి స్పందన వస్తుందని చిత్ర వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.