వరునికి 57, వధువుకు 38 ఏళ్లు
లేటు వయసులో ఒక్కటయ్యారు!
కదిరి టౌన్: కదిరి రూరల్ మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన దుస్సాని రామిరెడ్డి, చంద్రకళ లేటు వయసులో ఒక్కటయ్యారు. వీరికి కదిరి పట్టణంలోని శివాలయంలో శనివారం గ్రామ పెద్దల సమక్షంలో ఘనంగా వివాహo జరిగింది. రామిరెడ్డికి 57 ఏళ్ల వయస్సు కాగా.. ఏ కారణం చేతనో ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఇతని సోదరులకు మనవళ్లు కూడా ఉన్నారు. రామిరెడ్డి 15 ఏళ్లుగా ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. వధువు చంద్రకళకు 38 ఏళ్లు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఈమెకు గతంలో వివాహమైంది. భర్త అనారోగ్యంతో మృతి చెందాడు.
రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి చిప్పలమడుగు గ్రామానికి వచ్చింది. ఇక్కడే నివాసం ఉంటోంది. ఈమెకు సంతానం లేదు. కాగా.. ఒంటరిగా ఉంటూ చేయి కాల్చుకుంటున్న రామిరెడ్డికి తోడు కల్పించాలని బంధువులు, శ్రేయోభిలాషులు ఆలోచిస్తుండేవారు. ఈ విషయాన్ని చంద్రకళ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పెళ్లికి అంగీకరించారు. గ్రామ పెద్దలు పోరెడ్డి ఈశ్వర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, చిన్నపరెడ్డి, చంటిమల్ల రామిరెడ్డి, కాళసముద్రం సర్పంచ్ ఇంద్రప్రసాద్‌రెడ్డి, కదిరి మునిసిపల్ కౌన్సిలర్ అజ్జుకుంటి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో శనివారం ఉదయం 8.30 గంటలకు వివాహం జరిపించారు.