ఇంటి నుంచి వెళ్లి శవమయ్యాడు!
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు
అక్కిరెడ్డిపాలెం (గాజువాక) : రాత్రి ఇంటి నుంచి స్నేహితుడితో బయటకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి మరుసటి రోజు తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తల్లిదండ్రు లకు తీరని శోకాన్ని మిగిల్చాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... 59వ వార్డు నాతయ్యపాలెంలో నివాసముంటున్న అమరాపు ఆనందరావు చిల్లర వ్యాపారం నిర్వహిస్తున్నాడు. భార్య ప్రమీల, టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన కుమార్తె రమ్య, కుమారుడు నరేంద్రతో నివాసం ఉంటున్నాడు. నరేంద్ర నరవ ప్రాంతంలోని ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి నరేంద్రకు స్నేహితుడి నుంచి ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. తల్లిదండ్రులు వారించినా ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు. బయటకు వెళ్లిన కుమారుడు ఎంతకీ రాకపోవడంతో రాత్రంతా ఆందోళనలో కుటుంబ సభ్యులు గడిపారు. తెలిసిన వారందరినీ విచారించినా ఫలితం లేకపోయింది. శనివారం దువ్వాడ రైల్వే పోలీసుల నుంచి నరేంద్ర ఫోన్ నుంచి తల్లిదండ్రులకు కాల్ వచ్చింది. షీలానగర్ నుంచి నరవకు వెళ్లే రైల్వే బ్రిడ్జిపై ఒక యువకుడు మృతి చెంది ఉన్నట్లు తెలపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పట్టాలపై ఉన్న నరేంద్ర మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక చేతి మణికట్టు, కాలి పాదం వరకు తొలగిన ఆనవాళ్లుతో పాటు ముఖం ఒకవైపు చెక్కుకుపోయిన గుర్తులు ఉన్నాయని బంధువులు తెలిపారు. రైల్వే పోలీసులు ఆత్మహత్య కేసుగా నమోదు చేశారు. కేజీహెచ్‌లో పోస్టుమార్టం అనంతరం నాతయ్యపాలెం శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మృతిపై అనుమానాలు!
నాతయ్యపాలెం బంగారుమాంబ ఆలయం వద్ద నివాసం ఉంటున్న నరేంద్ర అంత దూరంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై చనిపోవడంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నరేంద్రకు ఫోన్ చేసింది ఎవరనేది తెలియదని తల్లిదండ్రులు అంటున్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని బంధువులు అంటున్నారు. సెల్ కాల్ డేటా ద్వారా అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని, ఆ కోణంలో విచారణ చేపట్టాల్సిందిగా గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు