అమరావతిలో తెలుగుదనం ఏదీ?
సందర్భం
నవ్యాంధ్ర రాజధాని ప్రణాళిక సిద్ధ మైంది. అమరావతి గురించే ప్రపంచం అంతా మాట్లాడుకునేలా, అందరూ ఇటువైపే చూసేలా నిర్మిస్తానని ముఖ్య మంత్రి ప్రకటించారు. పత్రికలు, చానళ్లు ఈ ప్రణాళికను ఆకాశానికి ఎత్తేశాయి. ముఖద్వారం, వాణిజ్యం, అధికారం, నదీతీరంతో చతుర్ముఖ వికాసానికి ప్రతి రూపంగా ఈ మహానగరిని అభివర్ణిం చాయి. 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో, కేంద్ర రాజధాని 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో, రాజధాని నగరం 742 చదరపు కిలోమీటర్ల పరిధిలో రాజధాని ప్రాంతాలను ప్రకటించారు. 2050 నాటికి 1 కోటి 35 లక్షల జనాభా, 56 లక్షల ఉద్యోగాలు గల నగరం అవుతుందని వెల్లడించారు. లక్ష కోట్ల రూపాయలకు పైబ డిన ఖర్చుతో కూడిన భారీ చిత్రాన్ని రూపొందించారు.
రాజధానిపై విడుదల చేసిన నమూనా చిత్రాలు అబ్బుర పరు స్తున్నాయి. సింగపూర్‌లో విహరిస్తున్నట్లు, కాన్బెర్రాలో ప్రయాణి స్తున్నట్లు, న్యూయార్క్‌లో నివసిస్తున్నట్లు మురిపిస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరును ప్రకటిస్తే అంతా ఆనందపడ్డారు. బుద్ధుని కాలచక్రం చుట్టూ కలలు కన్నారు. ఆ సందర్భంగా ధరణికోటను తవ్వి తలకెత్తుకుంటే అందరూ గర్వ పడ్డారు. పత్రికలు, ప్రసార మాధ్యమాలు దీని గత చరిత్ర చుట్టూ కథలల్లి తెలుగు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఇప్పుడు విడు దలైన రాజధాని నమూనా చిత్రాలు ఆంధ్రుల చరిత్ర, సాంస్కృతిక వారసత్వాలను పుణికిపుచ్చుకోలేదని స్పష్టమైంది.
దీనికి సింగపూర్ బృందాన్ని తప్పు పట్టకూడదు. పట్టణ ప్రణాళికల రూపకల్పనలో వారికున్న అనుభవాన్ని నమూనా చిత్రాలే చాటి చెబుతున్నాయి. మన ప్రభుత్వం కోరిన దానినే వారు ఇచ్చి ఉంటారు. వివిధ దేశాలలో దేవుళ్లు ఆయా ప్రజల రూపాలలో ఉన్నట్లే మన రాజధాని చిత్రాలు తెలుగు గడ్డ మీద నాటిన సింగ పూర్ మొక్కల్లాగా ఉన్నాయి.
ప్రపంచీకరణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వల్ల పట్టణ ప్రణాళికా రచనలో చోటు చేసు కున్న విపరిణామాలను ప్రముఖ పట్టణ ప్రణాళికా రచయిత ఎడ్వర్డ్ టి మెక్ మహూన్ సోదాహ రణలతో ప్రకటించారు. అమెరికాలో ఏదో ఒక పట్టణంలో ఎవరి నైనా రోడ్డు పక్కన వదిలి పెడితే తాను ఎక్కడ ఉన్నదీ ఊహించి చెప్పలేడు. అన్నీ ఒకేలా ఉంటాయి. ఇప్పుడు పట్టణ ప్రణాళికా రచన మరింత సులభతరం అయింది. న్యూజెర్సీలో కార్పొరేట్ కంపెనీలలో కంపూటర్లలో తయారైపోతాయి. అవే పోర్ట్ ల్యాం డ్లో, ఫోనిక్స్, ఫిలడల్ఫియాలో మళ్లీ మళ్లీ వినియోగంలోకి వస్తా యి. గతంలో ప్రతి పట్టణానికి తనదైన ప్రత్యేకత ఉండేది. ప్రత్యేక నిర్మాణశైలితో పట్టణాలు ఏకైక రూపాలుగా ఉండేవి.
ఇప్పుడు ఏకైక రూపాలకు బదులు ఏకరూప పట్టణాలు పుట్టుకొస్తున్నాయి. వాటి ప్రత్యేక నిర్మాణశైలి అంతరించి మూసపో సిన స్థిర రూప నిర్మాణ పద్ధతి సాగుతున్నది. భవిష్యత్తులో పట్టణ ప్రణాళికా రచయితలు పట్టణాలకు ప్రత్యేకతనీ, ఏకైక రూపాన్ని ఇచ్చే సాంస్కృతిక, నిర్మాణ కళారీతులను పట్టించుకోకపోతే అక్కడి ప్రజలకు ఆ పట్టణాలు ఎప్పుడూ పరాయివి గానే ఉంటాయి.
సాంస్కృతికంగా, ప్రకృతిప రంగా, ప్రత్యేక నిర్మాణ కౌశలాల పరంగా ఏకైక గుర్తింపు గల ప్రాం తాలను, పట్టణాలను మాత్రమే పర్యాటకులు ఎంచుకుంటారు. ఆం ధ్రులు గర్వించే రాజధానిని నిర్మిస్తానని, అది ప్రజా రాజధానిగా ఉంటుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. నమూనా చిత్రాలలో అది గోచరించడం లేదు. రాజధానికి కావలసిన ఆధునిక అవస రాలకు సింగపూర్ బృందం ఇచ్చిన సాంకేతికపరమైన నమూనాగా వినియోగించుకోవాలి. అదే సమయంలో నవ్యాంధ్ర రాజధానికి ఒక చారిత్రక నేపథ్యాన్ని, సాహిత్య సాంస్కృతిక వారసత్వాన్ని, భారతీయ నిర్మాణ రీతులను మేళవించాలి.
పంట భూములలో, చారిత్రక వారసత్వ ప్రదేశాలు ప్రత్య క్షంగా లేనిచోట కొత్త రాజధానిని నిర్మిస్తున్నారు. అందుచేత రాజ ధానికి ప్రత్యేకతలు కల్పించడానికి చరిత్రను పునఃసృష్టి చేయాలి. మనకున్న కోటలు, రాజ ప్రాసాదాలు, పలు నిర్మాణ రీతులు, మిశ్రమ కళాకృతులు ఉన్నాయి. వీటిని యథాతథంగా అనుకరించ కుండా కొత్త నిర్మాణ రూపాల సృష్టికి వినియోగించుకోవాలి. అప్పుడే రాజధాని ఆంధ్రులకు గర్వకారణం అవుతుంది. లేకపోతే బ్రెసిలియా పట్టణ చేదు అనుభవం మిగులుతుంది.
బ్రెజిల్‌కు 1956-60 సంవత్సరాల మధ్య బ్రెసిలియా పేరు తో కొత్త రాజధానిని సరికొత్త ప్రదేశంలో నిర్మించారు. గతం వైపు చూడని ముందుచూపు మాత్రమే గల కొత్త సమాజం లక్ష్యంగా ఈ రాజధాని ప్రణాళికను రూపొందించారు. ఉద్దేశపూర్వకంగానే చారిత్రక నేపథ్యం లేకుండా చేశారు. బ్రెసిలియాను ఒక అల్ట్రా మోడరన్ మాన్యుమెంటల్ పట్టణంగా నిర్మించారు. అందరి దృష్టి లోనూ ఇది అబ్బురపరచే పట్టణం. కానీ కృత్రిమ పట్టణం. ఆ నగర వీధులలో సంచరించడానికి ప్రేరణనిచ్చే స్థల నేపథ్యపు జీవ కళ లేకుండా పోయింది. ఇదీ బ్రెసిలియా విషాదం.
ప్రజా రాజధాని అంటే ముఖ్యమంత్రి దృష్టిలో 1 కోటి 35 లక్షల జనాభాతో కేంద్రీకృత అభివృద్ధి గల మహానగరంగా కనిపి స్తున్నది. కేంద్రీకృత అభివృద్ధి నమూనా ఫలితాలు తెలిసి కూడా హైదరాబాద్‌కు పైచేయిగా ఉండే నగరాన్ని నిర్మించాలన్న ఆదు ర్దాతో అదే నమూనాకు పునాదులు వేస్తున్నారు. ఇలాంటి కేంద్రీ కృత రాజధాని జిల్లాల అభివృద్ధిని వాతాపిజీర్ణం చేస్త్తుంది. ప్రతి చిన్న ఉపాధికి వలసలను తప్పనిసరి చేస్తుంది. అభివృద్ధిని వికేం ద్రీకరించకపోతే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు శాశ్వతంగా పేదరికంలోనే ఉండిపోతాయి. ఇతర జిల్లాలు ఎదుగు బొదుగూ లేనివి అవుతాయి. అన్ని జిల్లాలు రాజధాని మీదే ఆధారపడే స్థితికి బదులు రాజధాని అన్ని జిల్లాల అభివృద్ధికి చోదకశక్తి కావాలి. అమరావతి రాజధానిలో తెలుగుదనం ప్రక్షిప్తం కాకపోతే ప్రజలకు గర్వకారణం కాకపోగా పరాయి పట్టణాన్నే తలపిస్తుంది.
డీవీవీఎస్ వర్మ
(వ్యాసకర్త అధ్యక్షులు-ఏపీ లోక్‌సత్తా పార్టీ) మొబైల్: 9866074023