dwaraka tirumala venkateswara swamy
-
నేడు తెరుచుకోనున్న ద్వారక ద్వారాలు
పశ్చిమగోదావరి,ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ ద్వారాలు శనివారం తెరచుకోనున్నాయి. కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో కలెక్టర్ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి 31 వరకు ద్వారకాతిరుమలలో లాక్డౌన్ విధించారు. దీంతో దేవస్థానం అధికారులు ఆరోజు నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. లాక్డౌన్ ముగియడంతో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈఓ రావిపాటి ప్రభాకరరావు తెలిపారు. కేశఖండన శాలలో యాత్రికులు మొక్కుబడులు తీర్చుకోవచ్చని చెప్పారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని, విధిగా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆదివారం జిల్లా అంతటా లాక్డౌన్ విధించిన కారణంగా ఆరోజు భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కేశఖండనశాలను కూడా మూíసివేస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈఓ కోరారు. -
‘దేవుడి’ సొమ్ముకే టెండర్
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. టెండర్లు పిలువకుండానే, లక్షలాది రూపాయల మేర అభివృద్ధి పనులను కొందరు అధికారులు గుట్టుచప్పుడు కాకుండా జరిపించేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారనేది పక్కనబెడితే, దీని వల్ల లక్షలాది రూపాయల మేర దేవుడి సొమ్ము దుర్వినియోగమవుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సాధారణంగా రూ.30 వేలు పైబడి ఖర్చు చేసే ఏ పనికైనా దేవస్థానం మాన్యువల్ టెండర్‌ను పిలవాలి. అలాగే లక్ష రూపాయలు పైబడి జరిగే పనులకు ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్‌ను పిలిచి, ఎవరు తక్కువకు టెండర్ వేస్తే.. వారికే పనులను అప్పగించాలి. ఇలా చేయడం ద్వారా తక్కువ ఖర్చుతో, సకాలంలో పనులు పూర్తవడంతో పాటు, పనుల్లో నాణ్యత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ నిబంధనలేవీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. అత్యవసరం పేరుతో 90 శాతం అభివృద్ధి పనులను ఎటువంటి టెండర్లూ లేకుండానే చకచకా కానిచ్చేస్తున్నారు. తమకు కావాల్సిన వారికి అధికారులు పనులను అప్పగించి, వారికి సొమ్ములను ముట్టచెబుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వ్యక్తికి పనులు అప్పగింత ద్వారకాతిరుమలలో దాదాపు ఐదు జేసీబీలు ఉండగా, ఎప్పుడూ ఒక జేసీబీ యజమానికే దేవస్థానం ఇంజినీరింగ్ విభాగ అధికారులు పనులను అప్పగిస్తున్నారు. ఈ విషయంలో గతేడాది సెప్టెంబర్ 7న ఇద్దరు జేసీబీ యజమానులకు, దేవస్థానం అధికారులకు మధ్య ఘర్షణ కూడా జరిగింది. చివరకు ఆ గొడవ రోడ్డుపైనే సెటిల్మెంట్ అయ్యింది. అయినా అధికారులు తమకు అనుకూలంగా ఉన్న ఆ జేసీబీ యజమానికే ఇప్పటికీ టెండర్లు లేకుండా పనులను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయలపైబడి జరిగిన పనులకు సైతం రూ.30 వేలు లోపు, పలు బిల్లులను పెడుతూ ఆ వ్యక్తికే లబ్ధి చేకూరుస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీవారి శేషాచలకొండపై ఇటీవల జేసీబీతో జరుగుతున్న పనులు తక్కువ పని చేసినా.. జేసీబీ దాదాపు 4 గంటలు పనిచేస్తే, 10 గంటలు పనిచేసినట్లు బిల్లుల్లో చూపుతూ, గంటకు రూ.వెయ్యి వరకు అధికారులు ఆ వ్యక్తికి నగదు చెల్లింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీబీ ఎంత సమయం పనిచేసిందనే దాన్ని రీడింగ్ రూపంలో సంబంధిత సిబ్బంది లాక్‌బుక్ రాయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే దేవస్థానం బిల్లులను చెల్లించాల్సి ఉంది. అయితే ఈ పనులకు ఎటువంటి లాక్‌బుక్ లేనట్లు తెలుస్తోంది. తక్కువ పనిచేసినా.. ఎక్కువ పనిచేసినట్లు సిబ్బంది చేప్పే, ఒట్టి నోటి మాటల ద్వారానే, పెద్ద మొత్తంలో బిల్లులు ఒకే వ్యక్తికి ఇవ్వడం వల్ల చినవెంకన్న సొమ్ముకు గండి పడుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొక్కల పెంపకానికి, ఇతర పనులకు మట్టిని తోలే పనులను సైతం అదే వ్యక్తికి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇలా అన్ని పనులూ దాదాపుగా ఒకే వ్యక్తికి అధికారులు అప్పగించడం వెనుక ఆంతర్యం ఏమిటో ఆ చినవెంకన్నకే తెలియాలి. ఇప్పటికైనా అధికారులు నిబంధనలను పాటించి, అభివృద్ధి పనులకు టెండర్లను పిలవాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ దంతులూరి పెద్దిరాజును వివరణ కోరేందుకు యత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
చిన్నతిరుపతిలో గెటప్ శ్రీను సందడి
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: నటుడు గెటప్ శ్రీను కుటుంబ సమేతంగా మంగళవారం చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. శ్రీవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మాట్లాడుతూ.. టీవీ కామెడీ షోలతో పాటు ఇంత వరకు దాదాపు 50 సినిమాల్లో నటించానని చెప్పారు. ఇటీవల రంగస్థలం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రస్తుతం మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న మహర్షి సినిమాలోను, సుమంత్ హీరోగా నటిస్తున్న సుబ్రహ్మణ్యం చిత్రంతో పాటు, మరో రెండు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. -
శ్రీవారి ఆలయ సిబ్బందిపై టీడీపీ నాయకుల దాడి
ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన భీమడోలుకు చెందిన టీడీపీ నాయకులు దేవస్థానం అవుట్ సోర్సింగ్ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. వివరాలు ఇవి.. భీమడోలు నుంచి కొందరు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రగా ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి ఆదివారం వచ్చారు. కాలి నడకన వచ్చిన వారికి ఇచ్చే ఉచిత దర్శనం టికెట్లు కావాలని ఆలయ సిబ్బందిని అడిగారు. సమాచార కేంద్రం వద్ద ఉండే రిజిస్టర్లో సంతకం చేసి టికెట్లు పొందాలని సిబ్బం ది వారికి సూచించారు. దీంతో వారు రిజిస్టర్ ఇక్కడికే తేవాలని డిమాండ్ చేయగా సిబ్బంది అందుకు నిరాకరించారు. టికెట్ల కోసం సమాచార కేంద్రం వద్దకు వెళ్లిన టీడీపీ నాయకులు అక్కడ ఉన్న స్వీపర్ దుర్గ, సూపర్వైజర్ శివతో వాగ్వివాదానికి దిగారు. ఆ నేతల్లో ఒకరైన గన్ని గోపాలరావు తాను ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తమ్ముడినని చెప్పారు. ఇప్పటి వరకు మీరెవరో తెలియదని సిబ్బంది వారికి క్షమాపణ చెప్పారు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న తెలుగు తమ్ముళ్లు ఒక్కసారిగా శివపై దాడి చేశారు. వారిని ఆపేందుకు సమాచారకేంద్రం గుమాస్తా బొక్కా బాబ్జి, సిబ్బంది నరేష్, సెక్యురిటీ గార్డు నాయుడు, పలువురు స్వీపర్లు ప్రయత్నించినా వారు శాంతించలేదు. అడ్డు వెళ్లిన వారిని సైతం కొట్టారు. శివ చేసేదిలేక ఓ టీడీపీ నాయకుడి చేతిని కరిచి తప్పించుకున్నాడు. అధికారం చేతిలో ఉందని కొట్టేస్తారా అంటూ దేవస్థానం సిబ్బంది ధ్వజమెత్తారు. సిబ్బంది దురుసుతనం వల్లే ఈ గొడవ జరిగిందని, తమ తప్పేమి లేదని టీడీపీ నాయకులు చెప్పుకొచ్చారు. ఇరువర్గాల వారు దేవస్థానం కార్యాలయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. విషయం తెలుసుకున్న ఈవో వేండ్ర త్రినాథరావు తక్షణ చర్యగా గొడవలో ఉన్న స్వీపర్ దుర్గ, సూపర్వైజర్ శివలను విధులనుంచి ప్రక్కన పెట్టాలని ఏఈవో దుర్గారావుకు సూచించారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.