కనుల పండువగా వసంతోత్సవం
ద్వారకా తిరుమల : చిన వెంకన్న ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు మంగళవారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం ఆలయంలో చూరో్ణత్సవం, వసంతోత్సవం కార్యక్రమాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి వసంతోత్సవం తిరువీధుల్లో ఘనంగా జరిపారు. రాత్రి ఆలయ ఆవరణలో స్వామివారికి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్ప యాగోత్సవాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు.
వసంతోత్సవం ఇలా..
ఆలయ కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలు జరిపారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లకు వసంతాలను సమర్పించారు. అర్చకులు శ్రీ స్వామివారిని కీర్తిస్తూ వడ్లను దంచారు. అనంతరం భక్తులకు వసంతాలను వేడుకగా చల్లారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి సతీమణి భాగ్యలక్ష్మి కల్యాణ మూర్తులకు వసంతాలు సమర్పించారు. ఎంతో వేడుకగా జరిగిన ఈ ఉత్సవం భక్తులను అలరించింది.
నేత్రపర్వంగా ద్వాదశ కోవెల ప్రదక్షిణలు
దేవాలయ ప్రాంగణంలో ఉభయ దేవేరులతో శ్రీనివాసమూర్తికి 12 ప్రదక్షిణలు, 12 సేవా కాలాలు, 12 రకాల పిండి వంటలతో నివేదన కార్యక్రమాలు రాత్రి కనుల పండువగా జరిపారు. ఈ ద్వాదశ కోవెల ప్రదక్షిణలో అర్చకులు, పండితులు, భక్తులు, అధికారులు పాల్గొన్నారు. ఒక్కో ప్రదక్షిణతో ఒక్కో సేవాకాలాన్ని నిర్వహించారు. అలాగే ఒక్కో ప్రదక్షిణకు ఒక్కో పిండివంటను ఆరగింపుచేసి స్వామికి హారతులనిచ్చారు. వీణా, వేణువు, మృదంగం, గానం, నృత్యం, శృతి, శ్మ్రుతి, ద్రవిడ వేదం, బేరి, కాహలము, గంటారావం, నిశ్వబ్దం వెరసి 12 సేవలు, 12 ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పవళింపుసేవా మందిరాన్ని సుగంధ భరిత పుష్పమాలికలతో అలంకరించారు. తరువాత శ్రీపుష్పయాగోత్సవాన్ని వేద మంత్రోచ్ఛరణలతో అర్చకులు, పండితులు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.