డ్యుయెల్ డిగ్రీ చేయొచ్చు
మై క్యాంపస్ లైఫ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- కాన్పూర్.. ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యుత్తమ బోధన, పరిశోధనలకు పెట్టింది పేరు. ఇటీవల క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ జాబితాలో ప్రపంచంలోనే 300వ స్థానంలో నిలిచింది. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రాయభారం అర్చిత్ తన క్యాంపస్ లైఫ్ విశేషాలను, ప్రత్యేకతలను వివరిస్తున్నారిలా..
మాది హైదరాబాద్. మొదటి నుంచీ నాకు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉంది. నాలుగు ఐఐటీలు (బాంబే, ఖరగ్‌పూర్, కాన్పూర్, మద్రాస్) మాత్రమే ఈ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ను అందించడంలో ఐఐటీ-కాన్పూర్‌కు మంచి పేరుంది. దీంతో ఇక్కడ చేరాను.
విద్యార్థులు ఎంతో ఫ్రెండ్లీ
ప్రవేశం లభించిన వారందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. ఒక్కో రూమ్‌కు ఇద్దరు చొప్పున ఉండొచ్చు. హాస్టల్ వార్డెన్‌గా ప్రొఫెసర్ విధులు నిర్వర్తిస్తారు. క్యాంపస్‌లో ర్యాగింగ్ లేదు. విద్యార్థులంతా స్నేహంగా ఉంటారు. క్యాంటీన్లో ఆహారం బాగుంటుంది. ఇన్స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో ఉన్నా దక్షిణాది వంటకాలన్నీ క్యాంటీన్లో లభిస్తాయి.
నిపుణులైన ఫ్యాకల్టీ
సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులు/ప్రాక్టికల్స్/ల్యాబ్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు.. సబ్జెక్టులకనుగుణంగా షెడ్యూల్‌ను బట్టి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులు ఉంటాయి. ఒక్కో క్లాసు వ్యవధి 60 నిమిషాలు. తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు ప్రాక్టికల్స్/ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ బోధిస్తున్న ఫ్యాకల్టీ అంతా ఎంతో నిష్ణాతులు. బోధనలో అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్ వాడతారు. సబ్జెక్టు సందేహాలను వెంటనే నివృత్తి చేస్తారు. ఫోన్/ఈ-మెయిల్ ద్వారా కూడా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది. అదేవిధంగా ప్రతి సబ్జెక్టుకు కనీసం ఇద్దరు చొప్పున ట్యూటర్లు కూడా ఉంటారు. ఎక్కువ సిలబస్ ఉన్న సబ్జెక్టులకు ఒక్కోదానికి 12 మంది ట్యూటర్లు ఉంటారు. వీరు కూడా అకడమిక్‌పరంగా విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తారు.
డ్యుయెల్ డిగ్రీని ఎంచుకునే అవకాశం
నాలుగేళ్ల బీటెక్ కోర్సు.. సెమిస్టర్ విధానంలో ఉంటుంది. ప్రతి ఏడాదిలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. మూడో ఏడాదిలో ఎక్కువగా ప్రాక్టికల్ వర్క్/ల్యాబ్ వర్క్ చేయాలి. మూడో ఏడాది చివరలో డ్యుయెల్ డిగ్రీని ఎంచుకునే అవకాశం ఉంది. ఇష్టమున్న స్పెషలైజేషన్‌ను ఎంచుకుని మరో ఏడాది అదనంగా చదివి డ్యుయెల్ డిగ్రీ (ఐదేళ్లు) పొందొచ్చు. అయితే డ్యుయెల్ డిగ్రీని విద్యార్థులు ఆసక్తి ఉంటే ఎంచుకోవచ్చు.. లేదంటే లేదు. ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటు హ్యుమానిటీస్ కోర్సులను కూడా చదవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేలోపు నాలుగు లేదా ఐదు హ్యుమానిటీస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. నేను ఫస్టియర్‌లో సైకాలజీ, సెకండియర్‌లో ఫిలాసఫీలను ఎంచుకున్నాను. ప్రతి సెమిస్టర్లో మిడ్ సెమిస్టర్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సాధారణంగా ఐదు లేదా ఆరు కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తారు. నేను ఇప్పటివరకు 10కి 8.2 సీజీపీఏ సాధించాను. ఇక సెమిస్టర్‌కు అన్ని ఫీజులు కలుపుకుని రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు అవుతాయి.
క్యాంపస్.. కలర్‌ఫుల్
క్యాంపస్‌లో ప్రతి ఏటా వివిధ ఫెస్ట్‌లు జరుగుతుంటాయి. ప్రతి ఏడాది టెక్నికల్ ఫెస్ట్ ఉంటుంది. ఇందులో భాగంగా నాలుగు రోజులపాటు టెక్నాలజీ సంబంధిత అంశాలపై పోటీలు, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. దేశవిదేశాల్లోని ప్రముఖ విద్యా సంస్థలు, పరిశోధన సంస్థల నుంచి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఈ ఫెస్ట్‌కు హాజరవుతారు. ఏటా కల్చరల్ ఫెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. సినీ రంగానికి చెందినవాళ్లు క్యాంపస్‌కు విచ్చేసి ఉత్సాహపరుస్తుంటారు. క్యాంపస్‌లో తెలుగు విద్యార్థులమంతా కలిసి తెలుగు సమితిని ఏర్పాటు చేశాం. ఉగాది, వినాయక చవితి, దీపావళి, హోళి వంటి పండుగలను బాగా చేస్తాం. శని, ఆదివారాలు క్లాసులుండవు. సాయంత్రం తరగతులు ముగిశాక స్క్వాష్, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు ఆడతాం.
స్టార్టప్స్‌కు ప్రోత్సాహం
క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెల్ కూడా ఉంది. కొత్త స్టార్టప్స్ ఏర్పాటు చేయాలనుకునేవారికి వివిధ కంపెనీలతో ముఖాముఖి ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే కంపెనీలు ఫండింగ్ సదుపాయం కల్పిస్తాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అయితే డ్యుయెల్ డిగ్రీ చేసినవాళ్లు చక్కటి అవకాశాలను ఒడిసిపడుతున్నారు. సగటున ఏడాదికి రూ. ఆరు నుంచి రూ. ఏడు లక్షలు, గరిష్టంగా రూ.16 లక్షల వేతనాలు అందుతున్నాయి. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్ చేయాలనుకుంటున్నా.