ఇవి ఎలా పనిచేస్తాయంటే..!
ఈ ఆర్బిట్రేజ్ ఫండ్స్ కూడా ఈక్విటీ ఫండ్ల విభాగంలోకే వస్తాయి. కాకపోతే వీటి పనితీరు చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా ఈక్విటీ ఫండ్లు షేర్లను కొనటం... అమ్మడం ద్వారా వచ్చే లాభనష్టాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. అదే ఆర్బిట్రేజ్ ఫండ్స్ విషయానికి వస్తే ఒక కంపెనీ షేరు ధర, ఫ్యూచర్ ధరలో ఉండే వ్యత్యాసంతో పాటు... వివిధ ఎక్స్ఛేంజీల్లో ఒక షేరు ధరలో ఉండే తేడాలను కూడా ఇవి సొమ్ము చేసుకుంటాయి. ఉదాహరణకు శుక్రవారం నాటి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధరనే తీసుకుందాం. బీఎస్ఈలో రిలయన్స్ షేరు ధర రూ.861.05 వద్ద ట్రేడయ్యే సమయంలో... ఎన్ఎస్ఈలో రూ. 860.95 దగ్గర ట్రేడయింది. అంటే ఎన్ఎస్ఈలో కొని, బీఎస్ఈలో విక్రయిస్తే షేరుకు 10 పైసలు లాభమొస్తుంది. ఈ ఫండ్లు పెద్ద ఎత్తున షేర్లను కొని విక్రయిస్తాయి కనక 10 పైసల లాభం కూడా వీటికి ఎక్కువగానే ఉంటుంది.
అలాగే ఫ్యూచర్స్ అండ్ క్యాష్ మార్కెట్ ధరలో ఉండే తేడా నుంచి కూడా ఇవి లాభాలను ఆర్జిస్తాయి. ఎన్ఎస్ఈలో రిలయన్స్ ప్యూచర్ ధర రూ.861.6 గా ఉంది. అంటే క్యాష్ మార్కెట్ కంటే 65 పైసలు ప్రీమియంలో ట్రేడ్ అవుతోంది. ఇటువంటి సందర్భాల్లో క్యాష్ మార్కెట్లో షేర్లను కొని ఫ్యూచర్స్ మార్కెట్లో విక్రయిస్తారు. కాంట్రాక్టు ముగిసే సమయం వచ్చే సరికి ఈ ప్రీమియం తగ్గుతూ వచ్చి క్యాష్ మార్కెట్ రేటుకు సమానమవుతుంది. తద్వారా షేరుకు 65 పైసలు లాభం వస్తుంది. ముఖ్యంగా ఒడిదుడుకుల మార్కెట్లో ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒడిదుడుకుల మార్కెట్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్ అధిక లాభాలను ఆర్జిస్తాయి. నిజానికి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కొనుగోళ్లు, అమ్మకాలు అనేవి భారీ మార్జిన్లతో జరగవు. వీటి మార్జిన్లన్నీ పైసల్లోనే ఉంటాయి. 10 పైసలు, 20 పైసలు... ఇంతకన్నా ఎక్కువ మార్జిన్ ఉండటం కష్టం. కాకపోతే భారీ పరిమాణంలో ట్రేడింగ్ చేస్తాయి కనక ఈ మొత్తం కూడా వాటికి చక్కని లాభాన్నిస్తుంది.