e-mail interview
-
భారత మూలాలు... నాకెంతో గర్వకారణం...!
న్యూఢిల్లీ: ఆయన రిషి సునాక్. బ్రిటన్ ప్రధాని. ఆ పీఠమెక్కిన తొలి భారత మూలాలున్న నేత. అత్తామామలు ఇన్ఫోసిస్ వంటి దిగ్గజం ఐటీ కంపెనీ వ్యవస్థాపకులు. అంతా కలిస్తే భోజనాల బల్ల దగ్గర వాళ్ల మధ్య ఏ అంశాలు చర్చకు వస్తాయి? రాజకీయాలా? అస్సలు కాదట. కేవలం క్రికెట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటారట. చివరికి రిషి ఇద్దరు కూతుళ్లు కూడా క్రికెట్ అంటే ప్రాణం పెడతారట. ఎంతగా అంటే, సర్వ కాల సర్వావస్థల్లోనూ భారత జట్టునే సమరి్థంచేటంతగా. అయితే, ఫుట్‌బాల్‌లో మాత్రం ఇంగ్లాండ్ జట్టును సమరి్థంచాలన్నదే వారికి ఆయన విధించే ఏకైక షరతు! సునాక్ తల్లిదండ్రులు ఇద్దరూ భారత మూకాలున్న వారే. తూర్పు ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లారు. ఇక ఆయన భార్య అక్షతా మూర్తి నారాయణ మూర్తి, సుధా మూర్తి దంపతుల ఏకైక సంతానం. జీ 20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్ వస్తున్న నేపథ్యంలో బుధవారం పీటీఐ వార్తా సంస్థకు ఇచి్చన ఇ– మెయిల్ ఇంటర్వ్యూలో రిషి పలు అంశాలు పంచుకున్నారు. సరదా సంగతుల నుంచి భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక బంధం దాకా అన్ని అంశాలనూ స్పృశించారు. భారత మూలాలు తనకెంతో గర్వకారణమని పునరుద్ఘాటించారు రిషి. బ్రిటన్ ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టినప్పుడు భారతీయుల నుంచి వ్యక్తమైన హర్షాతిరేకాలు చెప్పలేని అనుభూతి ఇచ్చాయని గుర్తు చేసుకున్నారు. అత్తామామలతో ముచ్చటించేటప్పుడు భారత రాజకీయాలు, టెక్నాలజీ, ప్రధానిగా బ్రిటన్ను నడిపించడంలో ఆయన ఎదుర్కొంటున్న సమస్యల వంటివి ఎంతమాత్రమూ ప్రస్తావనకు రావని ఒక ప్రశ్నకు బదులుగా రిషి చెప్పారు. ‘ రాజకీయాలను, కుటుంబాన్ని విడిగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డారు. మోదీతో భేటీ కోసం ఎదురు చూస్తున్నా... ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు రిషి చెప్పారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, ఇంగ్లాండ్ ద్వైపాక్షిక కృషి పాత్రపై లోతుగా చర్చిస్తామన్నారు. గత ఏడాది కాలంలో భారత్‌లో పర్యటించిన తన మంత్రివర్గ సహచరులు రెట్టించిన ఉత్సాహంతో తిరిగొచ్చారని చెప్పారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్–ఇంగ్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరేందుకు మరి కాస్త సమయం పడుతుందని రిషి అభిప్రాయపడ్డారు. కానీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 కల్లా రెట్టింపు చేయడమే లక్ష్యంగా అధునాతన ఒప్పందం కుదురుతుందని విశ్వాసం వెలిబుచ్చారు. ‘బ్రిటన్ వాణిజ్య మార్కెట్లో 4.8 కోట్లకు పైగా భారతీయ చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలున్నాయి. భారత ఎగుమతిదారులకు వాటితో యాక్సెస్ కల్పించేలా ఒప్పందం ఉండాలి. వార్షిక ద్వైపాక్షిక వర్తకం ఇప్పటికే రూ.3.5 లక్షల కోట్లు దాటేసింది‘ అని అన్నారు. ఇంగ్లాండ్‌లో 16 లక్షలకు పైగా భారతీయులున్నారు. భారత్ కు జీ 20 సారథ్యం... జీ 20 సారథ్యానికి భారత్ సరైన దేశమని రిషి అన్నారు. అపార వైవిధ్యానికి నెలవు భారత్. కొన్నేళ్లుగా అన్ని రంగాల్లోనూ అసాధారణ విజయాలు సాధిస్తూ ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శంగా నిలుస్తోంది. అలాంటి దేశం జీ 20 సదస్సుకు సారథ్యం వహిస్తుండటం సరైన సమయంలో జరుగుతున్న చక్కని ఘటన‘ అని అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిజంగా సెల్యూట్ చేస్తున్నా. ప్రపంచ సారథిగా భారత్ పోషిస్తున్న కీలక పాత్ర నిజంగా శ్లాఘనీయం‘ అన్నారు. ► బ్రిటన్ ప్రధాని కాగానే నేను చేసిన మొదటి పని అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి విందు ఇవ్వడమే. భవనమంతా విద్యుద్దీపాలు, పూలతో మెరిసిపోతుంటే చూసి చెప్పలేనంత భావోద్వేగానికి లోనయ్యా. ఒక భారతీయునిగా నాకెంతో గర్వకారణమైన విషయమది. ► నా గాథ నిజానికి లోతైన భారత మూలాలున్న ఎంతోమంది బ్రిటన్ వాసుల కథే. ఈ భిన్నత్వంలో ఏకత్వం బ్రిటన్ బలం. ► నేను పాటించే విలువలకు నా భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లిదండ్రులు, అత్తామామలు దారి చూపే దీపాలుగా నిలుస్తారు. ముఖ్యంగా అత్తామామల ఘనతలు చూసి నేనెంతో గరి్వస్తాను. ఏమీ లేని స్థితి నుంచి మొదలై ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఐటీ దిగ్గజ కంపెనీని స్థాపించే దాకా వాళ్ల ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. భారత్, ఇంగ్లాండ్‌ల్లో వేలాది మందికి అది ఉపాధి కలి్పస్తోంది. ప్రతి పౌరుడూ అలాంటి విజయాన్ని సాధించేందుకు వీలు కలి్పంచేలా బ్రిటన్ను తీర్చిదిద్దాలన్నది నా సంకల్పం. ► జీ 20 సదస్సు కోసం భార్య అక్షతతో కలిసి భారత్ లో పర్యటించనుండటం పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నా. బిజీ బిజీగా గడిపేలా ఇప్పటికే మొత్తం ప్లానింగ్ చేసుకున్నాం. భారత్‌లో మేం గతంలో వెళ్లాలని అనుకున్న పలు ప్రాంతాలకు వెళ్తాం. -
భారత్‌కు రావడానికి సరైన సమయం కాదు
నేరస్తుడిగా చూస్తున్నారు * నేను పారిపోలేదు * మీడియాతో మాట్లాడను * సండే గార్డియన్‌తో మాల్యా ఈ మెయిల్ ఇంటర్వ్యూ న్యూఢిల్లీ/హైదరాబాద్: భారత్‌కు రావడానికి ఇది సరైన సమయం కాదని కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే భారత్‌కు వచ్చే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు విజయ్ మాల్యాపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కింగ్ ఫిషర్ కంపెనీ ప్రావిడెండ్ ఫండ్ చెల్లింపుల్లో ఏమైనా అవకతవకలు జరిగాయా లేదా అన్న విషయమై దర్యాప్తు జరుపుతామని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మరోవైపు తమకు రావలసిన వేతన బకాయిల కోసం కింగ్ షిఫర్ మాజీ ఉద్యోగులు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. నేరస్తుడిగా ముద్ర: రూ.9,000 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత విషయమై విజయ్ మాల్యాపై వివిధ విచారణలు జరుగుతున్నాయి. ఈ విచారణలు జరుగుతుండగానే మాల్యా ఈ నెల 2న భారత్ నుంచి వెళ్లిపోవడం వల్ల రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.900 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలమైన కేసుకు సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈ నెల 18న ముంబైలో హాజరు కావలసిందిగా మాల్యాకు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ గత శుక్రవారం సమన్లు జారీచేసింది. అయితే తాను భారతీయుడినేనని, భారత్‌కు వెళ్లాలనుకుంటున్నానని, అయితే తననొక నేరస్తుడిగా ముద్రవేశారని సండే గార్డియన్‌కు ఇచ్చిన ఈ మెయిల్ ఇంటర్వ్యూలో మాల్యా పేర్కొన్నారు. తన తరపు వాదన వినిపించడానికి తగిన అవకాశం వస్తుందని ప్రస్తుతం అనుకోవడం లేదని పేర్కొన్నారు. భారత్‌కు వెళ్లడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఒక మిత్రుడితో కలసి భారత్ నుంచి వచ్చానని, అంతేకానీ పారిపోలేదని వివరించారు. నేరం చేయలేదు, బలిపశువునయ్యా: రుణాలు చెల్లించకపోవడం వ్యాపారానికి సంబంధించిన విషయ మని మాల్యా తెలిపారు. రుణాలిచ్చేటప్పుడే బ్యాంకులకు రిస్క్ ఉంటుందని తెలుసునని, అన్నీ అలోచించుకునే బ్యాంకులు రుణాలిస్తాయని వివరించారు. తాను ఎలాంటి నేరం చేయలేదని, తనను బలిపశువును చేశారని, తనను నేరస్తుడిగా చూడవద్దని పేర్కొన్నారు. తాను ఏమైనా మాట్లాడితే, ఆ మాటలను వక్రీకరిస్తారేమోనన్న భయంతో తాను మౌనంగా ఉంటున్నానని వివరించారు. ఎవరికీ తెలియకుండా దాక్కునే పరిస్థితులు సృష్టించారని, ఇది తనను బాధిస్తోందని మాల్యా పేర్కొన్నారు. అయితే పీటీఐ పంపిన ఈ మెయిల్స్‌కు మాల్యా స్పందించలేదు. మీడియా వేటాడుతోంది: మీడియా తనను వేటాడుతోందని మాల్యా ట్వీట్ చేశారు. అయితే తాను ఎక్కడున్నదీ కనిపెట్టలేకపోయిందని ఆయన ఆ ట్వీట్లో పేర్కొన్నారు. తాను మీడియాతో మాట్లాడదలచుకోలేదని, అందుకని మీడియా అలాంటి ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు. బ్రిటన్‌లోనే ఉన్నాడని ప్రచారం అవుతున్న విజయ్ మాల్యా కొన్ని రోజులుగా తన అభిప్రాయాలను ట్వీటర్ ద్వారానే వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. విజయ్ మాల్యా వ్యక్తిగత విషయాలపైనే కాకుండా విమానయాన రంగంలోని సమస్యలు, తన స్పోర్ట్, పానీయాల వెంచర్లకు సంబంధించిన విషయాలపై కూడా ట్వీటర్లో ట్వీట్లు పెడుతున్నారు. ఎయిర్ ఇండియా నష్టాలకు బాధ్యులెవరు? ప్రశ్నించిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ పాయ్ విజయ్ మాల్యా బ్యాంక్ రుణాలు ఎగవేసి భారత్ నుంచి పారిపోయాడని విమర్శలు వస్తున్నాయని, ఎయిర్ ఇండియా నష్టాల విషయంలో ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఇన్ఫోసిస్‌కు గతంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన టి. వి. మోహన్‌దాస్ పాయ్ ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా రూ.30,000 కోట్లు నష్టపోయిందని, కింగ్ ఫిషర్ నష్టాలకు విజయ్ మాల్యాను బాధ్యుడిని చేసినట్లే, రూ. 30వేల కోట్ల ఎయిర్ ఇండియా నష్టాలకు ఎవరు బాధ్యులని ఆయన అడిగారు. కింగ్ ఫిషర్ విషయంలో బ్యాంక్ సొమ్ములు, ఎయిర్ ఇండియా విషయంలో పన్నులు చెల్లించిన ప్రజల సొమ్ములు పోయాయని పేర్కొన్నారు. పార్లమెంట్, మీడియా.. ఈ విషయంలో అందరూ మౌనంగానే ఉన్నారని విమర్శించారు. ఇది హిపోక్రసీ తప్ప, మరేమీ కాదని చెప్పారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నందుకు విజయ్ మాల్యాను ఆయన తప్పుపట్టారు. విజయ్ మాల్యాను ప్రభుత్వం అరెస్ట్ చేయకూడదని, మాల్యా భారత్‌కు తిరిగి వచ్చి బ్యాంక్ బకాయిల్ని తీర్చాలంటూ ఆదేశించాలని మోహన్ పాయ్ సూచించారు.