పాలనలోనూ సింగపూర్ జోక్యం
‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థలకు భాగస్వామ్యం!
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో అంతా తామై వ్యవహరిస్తున్న సింగపూర్ సంస్థలు ఇకపై పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోనున్నాయి. ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టులో సింగపూర్ సంస్థల సాంకేతిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల ద్వారా సిటిజన్ చార్టర్తో పాటు సమాచార వ్యవస్థ మొత్తం సింగపూర్ ప్రభుత్వం తెలుసుకోనుంది. అలాగే రాష్ట్రంలో అమలు చేసే ఈ-గవర్నెన్స్లోనూ సింగపూర్ భాగస్వామ్యం వహించబోతోంది.
దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు చేయని ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకుగానూ రూ.2,358 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టు బాధ్యతల్ని సింగపూర్ సంస్థలతో పాటు విప్రో పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను ఈ-ప్రగతి ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. సింగపూర్ సంస్థల సహకారంతో దీనిని అమలు చేయనుంది.
అంటే మన రాష్ట్రంలో ప్రజల వివరాలతో కూడిన డేటా బేస్, వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులు సింగపూర్ ప్రభుత్వానికి తెలిసిపోతాయి. రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా రాష్ట్రానికి సంబంధించిన 150 ఏళ్ల డేటాను ఇప్పటికే ఏపీ సర్కారు సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించింది. ఇన్నేళ్ల రాష్ట్ర డేటా కోరుతుండటంపై అప్పట్లోనే అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ ఈ విషయాన్ని సమర్థించుకున్నారు.
కేవలం సింగపూర్ ప్రభుత్వ పరిశీలన కోసమే ఈ డేటా అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాగా, రూ.2,358 కోట్ల ప్రాజెక్టు వ్యయంలో రూ.1,528 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా, మిగిలిన సుమారు రూ.వెయ్యి కోట్లను పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్) విధానంలో సమీకరించేందుకు యోచిస్తున్నారు.