ఆత్మ విశ్వాసం ముందు.. అంగవైకల్యం బలాదూర్..!
ఆత్మ విశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తోంది ఇరవై మూడేళ్ళ లింగరీ మోడల్ కన్యా సెస్సర్. థాయిల్యాండ్ బుద్ధ దేవాలయం దగ్గర ఒక వారం వయసున్న అనాధగా మొదలైన ఆమె జీవితం... నేడు అందర్నీ విస్మయ పరిచే ఉన్నత స్థితికి చేరింది. ఐదేళ్ళ వరకూ అనాథాశ్రమంలో ఎన్నో బాధలతో కాలం వెళ్ళదీసిన సెస్సర్ ను.. పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. చిన్ననాటి కష్టాలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని అడ్డుకోలేకపోయాయి. నేడు ఓ లింగరీ మోడల్ గా రోజుకు 65 వేల రూపాయల దాకా సంపాదనతో సెస్సెర్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది.
సెస్సర్ కేవలం లోదుస్తుల మోడల్ మాత్రమే కాదు... దక్షిణ కొరియాలో పారాలింపిక్స్ శిక్షకురాలిగా కూడ రికార్డు సృష్టించింది. నైక్, వోల్కమ్, బిల్లాబాంగ్, రిప్ కర్ట్ గర్ల్ వంటి ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరిస్తూ విజయపథంలో దూసుకుపోతోంది. ''నేను భిన్నంగా ఉంటాను. సెక్సీగా కనిపించేందుకు కాళ్ళు లేకపోవడం పెద్ద విషయం కాదని ఫీలవుతాను. ప్రజలు ఊహించని విధంగా కనిపించేందుకు, నన్ను నేను ప్రదర్శించుకునేందుకు ప్రయత్నిస్తాను.'' అంటుంది కన్యా సెస్సర్.
చిన్నతనంనుంచీ కనీసం వీల్ ఛైర్ పై కూడ ఆధారపడకుండా.. చేతులతోనో, స్కాట్ బోర్డ్ ఆధారంగానో తనపనులు తాను చేసుకునేది. కాళ్ళు లేకపోయినా... స్కీయింగ్, స్కేటోబోర్డింగ్ ను ఎంతో ఇష్టపడుతుంది. ఈ సాహస మోడల్.. ఇక్కడతో ఆగలేదు. సీబీఎస్ కొత్త సిరీస్... కోడ్ బ్లాక్ లోనూ కనిపించనుంది. అంతేకాదు ఓ రచయితగానూ తన సత్తా చాటనుంది.