ఎర్త్ 2.0 దిశగా అడుగులు!
వాషింగ్టన్: భూమిని పోలిన మరో గ్రహాన్ని (ఎర్త్ 2.0) గుర్తించడంలో మార్గం సుగమమైంది. నక్షత్రాల రసాయనిక సమ్మేళనాన్ని విశ్లేషించే సరికొత్త పద్ధతి ద్వారా ఖగోళంలో భూమి వంటి గ్రహాలను గుర్తించడం తేలికవబోతోందని తాజా పరిశోధనలో తేలింది. అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అభివృద్ధి పరిచిన ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం (కంప్యూటేషనల్ మోడలింగ్ టెక్నిక్) తో నక్షత్రాల పూర్తి స్థాయి రసాయనిక స్థితిని తెలుసుకోవచ్చని, ఈ విధానంతో గ్రహం ఎప్పుడు ఏర్పడిందనే విషయాలను పూర్తిగా అధ్యయనం చేయొచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
దీనిద్వారా సౌర కుటుంబానికి వెలుపల ఉండే గ్రహంపై నివాస యోగ్య పరిస్థితులు, జీవుల పరిణామ స్థితిగతుల గురించి పూర్తి వివరాలను రాబట్టవచ్చని భావిస్తున్నారు. ఈ పద్ధతిని ఉపయోగించి ఇప్పటికే నక్షత్రాల్లోని 15 మూలకాల ద్వారా 16 వందల నక్షత్రాలకు సంబంధించిన ఉష్ణోగ్రత, ఉపరితల గురుత్వాకర్షణ, పరిభ్రమణ వేగం, రసాయనిక సమ్మేళనం వంటి అంశాలను నిర్ధారించారు.