ఎలక్షన్ ఇండియా
ఇది ఎన్నికల కాలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతూంటే... ఇతర రాష్ట్రాలు సార్వత్రిక ఎన్నికల హడావుడిలో ఉన్నాయి. ఎవరికి ఓటేయాలి? ఏ పార్టీకి విజయం కట్టబెట్టాలన్న యోచనలో ఓటరు ఉన్నాడు. వీరి పని కొంత సులువు చేసే లక్ష్యంతో అసోసియేషన్ ఫర్ డెమాక్రటిక్ రీఫార్మ్స్ ఓ స్మార్ట్ఫోన్ అప్లికేషన్ను సిద్ధం చేసింది. ‘ఎలక్షన్ ఇండియా’ పేరుతో గూగుల్ ప్లే స్టోర్లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ అప్లికేషన్ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల పుట్టుపూర్వోత్తరాలతోపాటు ఆయా పార్టీల ముఖ్యనేతల వివరాలనూ అందుబాటు లో ఉంచింది.
ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై వ్యాఖ్యానించేందుకు, అవ్యవహారాలేమైనా జరుగుతూంటే ఫొటోలు, వీడియోలు తీసి అప్లోడ్ చేసే ఏర్పాట్లూ చేశారీ అప్లికేషన్లో. రాజకీయ పార్టీలపై మీదైన విశ్లేషణలను ప్రచురించడంతోపాటు, ఇతరుల అభిప్రాయాలను, విశ్లేషణలను తెలుసుకునేందుకూ వీలుంది.
1952 మొదలుకొని తాజా సార్వత్రిక ఎన్నికల వరకూ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? పడ్డ ఓట్లు ఎన్ని? తదితర వివరాలూ ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ మీరు ఏ పార్టీకి ఓటేయదలుచుకున్నారో ‘మాక్ ఓటింగ్’ ద్వారా చెప్పవచ్చు. వీటి ఫలితాలు రాష్ట్రాలు, పార్టీల వారీగానూ ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు.
ఇలాంటివే మరికొన్ని...
గూగుల్ ప్లే స్టోర్లో ఎన్నికలకు సంబంధించి మరికొన్ని అప్లికేషన్లు కూడా అందుబాటులో ఉన్నాయి ‘ఓట్ ఫర్ ఇండియా’, ‘ఇండియన్ ఎలక్షన్స్ 2014’, ‘ఇండియా ఎలక్షన్స్ 2014’, ‘ఈసీ ఓటర్’ వంటివి మచ్చుకు కొన్ని. ‘ఎలక్షన్ వాచ్ రిపోర్టర్’ అప్లికేషన్ ద్వారా ఎన్నికల సందర్భంగా జరిగే అవ్యవహారాలను రిపోర్ట్ చేసే ఉద్దేశంతో అభివృద్ధి చేశారు. జీపీఎస్ సాయంతో ఎక్కడ అవ్యవహారాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలియజేయగలగడం, డబ్బు, మద్యం పంపిణీ, కోడ్ను ఉల్లంఘించే పోస్టర్లు వంటి ఎనిమిది వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ అప్లికేషన్ ద్వారా రిపోర్ట్ చేయవచ్చు.