హైదరాబాద్ లో వాస్సాప్ లాండ్రీ
ఈక్విటీ రూపంలో ఈజీ వాష్ కొనుగోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లాండ్రీ సేవలందిస్తున్న వాస్సాప్ సంస్థ... హైదరాబాద్‌లోనూ తన సేవలు ఆరంభించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం సేవలందిస్తున్న ‘ఈజీ వాష్’ సంస్థను ఈక్విటీ రూపంలో కొనుగోలు చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపక సీఈఓ బాలచందర్.ఆర్ చెప్పారు. మాదాపూర్, వైట్‌ఫీల్డ్ ప్రాంతాల నుంచి సేవలను ప్రారంభిస్తున్నామని... మూడు నెలల్లో 25 ప్రాంతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలియజేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో మూడేళ్లుగా లాండ్రీ సేవలందిస్తున్న ఈజీవాష్కు దాదాపు 8 వేల మంది కస్టమర్లున్నారని తెలియజేశారు.
‘‘రోజుకు ఈ సంస్థకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. ఇప్పుడిక ఈ ఈక్విటీతో వాస్సాప్ జంట నగరాల్లో తన సేవలను విస్తరించినట్లయింది’’ అని చెప్పారు. ప్రస్తుతం వాస్సాప్ లాండ్రీ, డ్రైక్లీనింగ్, షూ అండ్ బ్యాగ్స్ రీఫర్బిష్మెంట్ సేవలను బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్, ముంబై, చెన్నై, పుణే నగరాల్లో 50 పికప్ పాయింట్లతో అందిస్తోంది. 5 నెలల్లో మరో 50 పాయింట్లను ఫ్రాంచైజీ మోడల్లో ప్రారంభిస్తామని బాలచందర్ చెప్పారు. ‘‘వాస్సాప్ సొంతం చేసుకున్న రెండో కంపెనీ ఈజీవాష్. 3 నెలల క్రితమే ముంబైలోని చమక్ లాండ్రీ స్టార్టప్‌ను కొనుగోలు చేశాం. దేశంలోని మరో 3 కంపెనీల కొనుగోళ్లకు చర్చలు జరుపుతున్నాం’’ అని వివరించారు. కార్యక్రమంలో వాస్సాప్ కో-ఫౌండర్ దుర్గాదాస్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీపీ రవికుమార్ పింజల తదితరులు పాల్గొన్నారు.