ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
►పంటలను కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
►రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
మొయినాబాద్ రూరల్: లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అమ్డాపూర్ ఈసీవాగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఈసీ, కాగ్నా, మూసీవాగులతో పాటు కుంటలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని చెప్పారు. వరదనీరు ప్రవహిస్తున్న తీరును గమనించి ప్రజలు ముందుగానే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రైతులు, ప్రయాణికులు చిన్నచిన్న కాలువలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీవర్షాలతో వాగులు, కుంటలు నిండి చుట్టుపక్కల ఉన్న పంటపొలాలు నీట మునిగాయని చెప్పారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా పలికారు. ఈసీవాగును సందర్శించిన వారిలో ఎమ్మెల్యే కాలెయాదయ్య, ఆర్ఐ రాజు, వీఆర్ఓ విష్ణుగౌడ్, సర్పంచ్ సిద్ధయ్య, ఎంపీటీసీ సామరాంరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహ్మరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్థన్‌రెడ్డి, నాయకులు అనంతరెడ్డి, నర్సింహ్మచారి, శ్రీహరియాదవ్, సామ రవీందర్‌రెడ్డి, రవీందర్‌చారి, సంజీవరెడ్డి, కొండల్‌గౌడ్ తదితరులున్నారు.
రాకపోకలు బంద్
పరిగి పరివాహక ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరదనీరు రావటంతో ఈసీవాగు ప్రవాహం జోరందుకుంది. ఈ వాగు మండల పరిధిలోని నక్కలపల్లి, కేతిరెడ్డిపల్లి, అమ్డాపూర్‌ల మీదుగా హిమాయత్‌సాగర్‌కు చేరుతుంది. వాగులోకి భారీగా వరదనీరు రావటంతో చుట్టపక్కల పంటపొలాలు, రోడ్లు కొట్టుకుపోయాయి. అమ్డాపూర్ వద్ద ఉన్న ఈసీవాగు వంతెన సమీపంలో లోతట్టుగా ఉన్న కంచెమడుగు ప్రదేశం పూర్తిగా నీటితో నిండిపోవడంతో ప్రయాణికుల రాకపోకలు నిలిచిపోయాయి. మొయినాబాద్, శంకర్పల్లి నుంచి శంషాబాద్‌కు ఎంతో మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. కాని వరదనీటితో రాకపోకలకు ఆటంకం కలిగింది.