జిల్లాలో రెండు ఈకో పార్కులు
- జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్రెడ్డి
వనపర్తిరూరల్: మహబూబ్నగర్ జిల్లాలో రెండు ఈకో పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం మేరకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి మండలంలోని రిజర్వు ఫారెస్టు స్థలాన్ని ఆయన ఇక్కడి ఫారెస్టు రేంజర్ అధికారి మహెందర్రెడ్డి, అసిస్టెంట్ రేంజర్ అధికారి శ్యాంకుమార్తో కలిసి పరిశీలించారు. జిల్లాలోని మహబూబ్నగర్ అప్పనపల్లి వద్ద ఒకటి, వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని రిజర్వు ఫారెస్టులో మరొకటి ఏర్పాటు చేయటానికి స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు.
ఒక్కో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 2 కోట్ల చొప్పున నిధులు కేటాయించనుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హరితహారం పథకంలో భాగంగా ఈ పార్కుల నిర్మాణం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పార్కులలో వాకింగ్ ట్రాక్, రన్నింగ్, బైస్కలింగ్ట్రాక్లతో పాటు, వృక్షశాస్త్ర అధ్యయన కోసం ప్రత్యేక సెల్ నిర్మాణం చేస్తామన్నారు.
కాలగర్భంలో కలిసిపోతున్న ఔషద మొక్కలను పెంచటానికి ఈ పార్కులను ఉపయోగించు కుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నాచారంలో నిర్మాణం చేసిన ఈకో పార్కుల తరహాలో వీటిని నిర్మాణం చేస్తామన్నారు. ఒక్కో పార్కు సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయనతో పాటు వనపర్తి, మహబూబ్నగర్ ఫారెస్టు శాఖ అధికారులు ఉన్నారు.