యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఎలా ఉండబోతుంది? పూర్తి వివరాలు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రత్యక్ష ప్రభావం భారత్‌పై ఉండదని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ఎకనమిక్స్ రిసెర్చ్ రిపోర్ట్ విశ్లేషించింది. చమురు ధరల భారీ పెరుగుదలే భారత్ ఎకానమీకి అతిపెద్ద సవాలని శుక్రవారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
కీలక అంశాలు
- బేరల్‌కు 75 డాలర్లు ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన 2022–23 వార్షిక బడ్జెట్ రూపొందింది. అయితే సరఫరాలు కొరత, యుద్ధం వంటి పరిణామాలతో క్రూడ్ బేరల్‌కు 100 డాలర్లు దాటింది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, కరెన్సీ మార్పిడులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అంశం.
- కమోడిటీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత వంటి అంశాలు ప్రపంచ దేశాల ముందు ఉన్న ప్రధాన సవాళ్లు. దీర్ఘకాలం ఇదే ధోరణి కొనసాగితే పరిస్థితి వృద్ధి మందగమనానికి దారితీసే వీలుంది
- ఇరాన్ తరహాలో పాశ్చాత్య చెల్లింపులు, ఫాస్ట్–మెసేజింగ్ వ్యవస్థల నుండి రష్యాను మినహాయించే స్థాయికి శత్రుత్వాలు – ఉద్రిక్తతలు పెరిగితే ఇంధన సరఫరాల అంతరాయం కారణంగా వృద్ధికి తీవ్ర విఘాతం ఏర్పడవచ్చు. రష్యా తన గ్యాస్‌లో 40 శాతం, బొగ్గుతో సహా సగం ఘన ఇంధనం, చమురులో నాలుగింట ఒక వంతు ఐరోపాకు సరఫరా చేస్తుంది. ఇతర తీవ్ర ఆంక్షల సంగతి ఎలాఉన్నా, ఇప్పటివరకు గ్లోబల్ పేమెంట్ వ్యవస్థ నుండి రష్యాను అమెరికా నిషేధించకపోవడం గమనార్హం.
- యుద్ధ పరిస్థితికి ముందే 2022–23 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, ఫిబ్రవరి తొలి వారంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు జరిగాయి. దీనితో ఆయా నిర్ణయాలు, అంశాలు యుద్ధ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఉండకపోవచ్చు. ఈ తరహా సవాళ్లు భారత్ ఎకానమీలో తక్షణ అనిశ్చితికి దారితీయవచ్చు.
- ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం ఎకానమీపై ఏ స్థాయిలో ఉంటోందన్న అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలించాల్సిన అవసరం ఉంది. ద్రవ్యలోటు తగ్గింపు, స్థిరీకరణ బాటలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రుణ సమీకరణ పరిమాణం భారీగానే ఉంది. ఆయా అంశాల నేపథ్యంలో సబ్బిడీల పెంపు, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాల కోతకు అవకాశాలు చాలా పరిమితమే. 2022–23 ఆర్థిక సంవత్సరంలో తన వ్యయాల కోసం కేంద్రం రుణ సమీకరణల లక్ష్యం రూ.11,58,719 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలకన్నా (రూ.9,67,708 కోట్లు) ఇది దాదాపు రూ.2 లక్షల కోట్లు అధికం.
ద్వైపాక్షిక వాణిజ్యంపై ప్రభావం అంతంతే...
భారత్‌కు రష్యా ప్రధాన వాణిజ్య భాగస్వామి కాదు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, రష్యాకు భారతదేశం ఎగుమతులు కేవలం 2.7 బిలియన్ డాలర్లు. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఈ వాటా 0.9 శాతం. రష్యాకు ప్రధాన ఎగుమతుల్లో ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రికల్ మెషినరీ విభాగాలు ఉన్నాయి. ఇక ఇదే సమయంలో రష్యా నుండి భారతదేశం దిగుమతులు 5.5 బిలియన్ డాలర్లు. మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 1.4 శాతం. రష్యా నుండి భారతదేశం దిగుమతుల్లో సగభాగం పెట్రోలియం ఉత్పత్తులే. ఇతర మార్కెట్లతో ఈ వాటాను సులభంగా భర్తీ చేయడానికి వీలుంది. ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రష్యాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యంపై యుద్ధం ప్రభావం ఎటువంటి తీవ్ర ప్రభావం చూపదు.
చమురు దిగుమతుల తీరిది...
బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, భారతదేశ తన మొత్తం చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు దిగుమతులకు సంబంధించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో, భారతదేశం చమురు దిగుమతుల విలువ 82.7 బిలియన్ డాలర్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2021–జనవరి 2022 వరకూ) చమురు దిగుమతులు 125.5 బిలియన్ డాలర్లకు పెరిగాయి. దేశంలో ఎకానమీ రికవరీ, అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదల వల్ల ఆర్థిక సంవత్సరం ఇంకా దాదాపు రెండు నెలలు ఉండగానే దిగుమతులు విలువ భారీగా నమోదయ్యింది. చమురు ధరలు దాదాపు ఎనిమిది సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ దిగుమతులు విలువ తగ్గే పరిస్థితి ఏదీ కనిపించడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతుల విలువ 155.5 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నది అంచనా. 2022–23లో ఎకానమీ రికవరీ వేగవంతం వల్ల చమురు దిగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. 2022 ఏప్రితో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరంలో చమురు డిమాండ్ ఐదు శాతం పెరుగుతుందన్నది అంచనా. మిగిలిన అంశాలన్నీ యథాతథంగా కొనసాగుతాయని భావించిన పక్షంలో ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం వాణిజ్య లోటు 165 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే వీలుంది. చమురు ధరలు పెరిగే కొలదీ భారత్ దిగుమతుల భారం మరింత తీవ్రం అవుతుంది. శాశ్వత ప్రాతిపదికన చమురు ధరలలో ప్రతి 10 శాతం పెరుగుదలకు చమురు దిగుమతుల భారం 15 బిలియన్ డాలర్లు లేదా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీలో) 0.4 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నది అంచనా. ఇది దేశంలోకి వచ్చీపోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య వ్యత్యాసాలను ప్రతిబింబించే కరెంట్ అకౌంట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తీవ్ర కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) సమస్యకు ఈ పరిణామాలు దారితీయవచ్చు. చమురు అధిక ధరల వల్ల రూపాయి కూడా బలహీనపడే వీలుంది. ఇది వాణిజ్యలోటును మరింత పెంచే అంశం. ఆయా అంశాలు విదేశీ మారకానికి సంబంధించి దేశానికి ప్రతికూలంగా మారతాయి. కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుందని ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనావేసినప్పటికీ, చమురు ధరల తీవ్ర స్థాయిలో కొనసాగితే అంచనాలు మరింత పెంచాల్సిన అవసరం ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణం సవాళ్లు
టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఉత్పత్తుల బాస్కెట్లో ముడి చమురు సంబంధిత ఉత్పత్తుల వెయిటేజ్ 7.3 శాతంగా ఉంది. అందువల్ల చమురు ధరలలో 10 శాతం పెరుగుదల ప్రత్యక్ష ప్రభావం డబ్ల్యూపీఐపై 0.7 శాతంగా అంచనా ఉంటుందని అంచనా. పరోక్ష ప్రభావాన్ని కూడా జతచేస్తే, మొత్తం ప్రభావం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణంలో దాదాపు 1 శాతంగా ఉండవచ్చు. ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణంపై చమురు ధరల పెరుగుదల ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉంటుంది. చమురు ధరలలో 10 శాతం పెరుగుదల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం 0.15 శాతం పెరిగే వీలుంది. సరఫరా చైన్‌కు సంబంధించి పరోక్ష ప్రభావం, ఇతర ధరల పెరుగుదల కారణంగా 0.25–0.35 శాతం మేర వస్తువులు, సేవల ధరల పెరుగుదల ఉండవచ్చు.
ద్వైపాక్షిక చెల్లింపుల్లో సమస్యలు ఉండవు-పారిశ్రామిక వర్గాల అంచనా
రష్యాపై ఇతర పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించినా ఆ దేశంతో ద్వైపాక్షిక చెల్లింపులపై ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. మారక రేట్లలో హెచ్చుతగ్గులు తప్ప పెద్దగా మార్పులు ఉండబోవని పేర్కొన్నాయి. సాధారణంగా ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతులకు చెల్లింపులు భారత కరెన్సీ అయిన రూపాయల్లో జరుగుతుంటాయి. కాబట్టి పాశ్చాత్య దేశాల ఆంక్షల ప్రభావం చెల్లింపుల విషయంలో ప్రభావం చూపకపోవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. గతంలో ఇరాన్‌పై ఆంక్షలు అమలైనప్పుడు కూడా ఆ దేశంతో లావాదేవీల కోసం భారత్ ఇలాంటి వ్యూహాన్నే అనుసరించింది. దీని ప్రకారం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే భారత వ్యాపార వర్గాలు .. రూపాయి మారకంలో యూకో బ్యాంకులోని ఇరానియన్ బ్యాంకుల ఖాతాలో చెల్లింపులను డిపాజిట్ చేసేవి. ఇరాన్‌కు ఎగుమతి చేసే భారతీయ ఎగుమతిదారులకు ఈ ఖాతా నుంచే రూపాయి మారకంలో చెల్లింపులు జరిగేవి. ఈ లావాదేవీలన్నింటినీ ఏ రోజుకు ఆ రోజు సెటిల్ చేసేవారు. భారత్‌కు రక్షణ రంగ ఉత్పత్తులను రష్యా భారీగా సరఫరా చేస్తోంది. ఇంధనాలు, న్యూక్లియర్ రియాక్టర్లు, బాయిలర్లు మొదలైనవి ఎగుమతి చేస్తోంది. భారత్ నుంచి ఫార్మా ఉత్పత్తులు, ఎలక్ట్రికల్ యంత్ర పరికరాలు తదితర ఉత్పత్తులు రష్యాకు ఎగుమతి అవుతున్నాయి.
సీఏఐటీ ఆందోళన
రష్యా–ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సంక్షోభం ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యంపై ఎక్కువగా ఉంటుందని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి నుంచి దేశీ వాణిజ్యం కోలుకుంటుండగా, ఈ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని పేర్కొంది. చమురు ధరలు పెరగడం అత్యంత కీలకమైన అంశమని, ధరల పెరుగుదలకు ఇది దారితీస్తుందని వివరించింది. తయారీ, వస్తు రవాణా వ్యయాలు పెరిగి, ఉత్పత్తుల ధరలు మరింత భారం అవుతాయని వివరించింది.
చదవండి: Russia Ukraine War: సూపర్‌గా మారితే తప్ప చైనా ముప్పుని ఎదుర్కోలేం?