తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
తవణంపల్లె(చిత్తూరు): తల్లి మందలించిందనే మనస్తాపంతో చిత్తూరులో ఆదివారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఆమె బంధువుల కథనం మేరకు వివరాలివీ...తవణంపల్లె మండలం దిగువ మాఘం గ్రామానికి చెందిన కె.శివప్రసాద్, వాణి దంపతులు చిత్తూరు నగరంలోని దుర్గానగర్ కాలనీలో ఉంటున్నారు. వారికి కుమార్తెలు అభి, అనుష్న ఉన్నారు. చిన్న కుమార్తె అనుష్న ఇంటర్ ద్వితీయ సంవత్సరం (బైపీసీ) చదువుతోంది.
మొదటి సంవత్సరంలో రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించింది. ఆమెను పైచదువులు చదివించే విషయమై ఆదివారం తల్లిదండ్రులు మాట్లాడుతుండగా తాను మెడిసిన్ చదువుతానని అనుష్న చెప్పింది. తమకు అంత ఆర్థిక స్తోమత లేదని తల్లి వాణి మందలించింది. తర్వాత భార్యభర్తలిద్దరూ ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి కీనాటంపల్లెకు వెళ్లారు. తల్లి మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనుష్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. బయటకు వెళ్లిన శివప్రసాద్, వాణి ఇంటికి ఫోన్ చేశారు. రింగ్ అవుతున్నా ఎత్తలేదు. వారు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే కుమార్తె అనూష్న(17) శవమై ఉండడంతో కుప్పకూలిపోయారు. సోమవారం తమ స్వగ్రామం దిగువమాఘంలో దహనక్రియలు చేశారు.