ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ’ కార్డులు
ఏలూరు (మెట్రో) : జిల్లాలో నగదురహిత లావాదేవీల్లో భాగంగా ‘ఇ–మనీ ఈజ్‌మై మనీ’ కార్డులను అందచేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఏలూరు ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం నగదురహిత లావాదేవీలపై పెట్రోల్, గ్యాస్ కంపెనీల డీలర్లతో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగదురహిత లావాదేవీల్లో జిల్లా దేశానికే ఆదర్శంగా నిలిచేలా వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టనున్నామని చెప్పారు. జిల్లాలో 18 ఏళ్లు నిండి బ్యాంక్ ఖాతా లేని వారికి ఖాతాలు ప్రారంభింపచేయడంతో పాటు, ప్రతి ఒక్కరికీ ‘ఇ–మనీ ఈజ్‌మై మనీ’ కార్డులను అందిస్తామన్నారు. ఈ కార్డులో వ్యక్తి పేరు, ఎంఎంఐడీ, మొబైల్ నెంబర్, వర్చ్యువల్ ఐడీ, క్యూఆర్ కోడ్, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలు ఉంటాయన్నారు. స్మార్ట్ ఫోన్ లేకపోయినా, ఇంటర్నేట్ లేకపోయినా కార్డును ఉపయోగించి ఎంఎంఐడీ విధానం ద్వారా నగదు రహిత లావాదేవీలను భద్రతతో నిర్వహించుకోవచ్చన్నారు. టెక్నాలజీ వినియోగం ప్రారంభంలో కొంత ఇబ్బందిగా ఉన్నా భవిష్యత్‌లో సులభంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి సయ్యద్ యాసిస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, నిక్నెట్ సైంటిస్ట్ శర్మ, భారత పెట్రోలియం సేల్స్ అధికారి ప్రవీణ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ అధికారి దుర్గాప్రసాద్, గ్యాస్, పెట్రోలు డీలర్లు పాల్గొన్నారు.