ఎడ్‌సెట్ ప్రశాంతం
బీఎడ్‌లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్-2014 శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 7 పరీక్షా కేంద్రాల్లో 2,634 మంది అభ్యర్థులకు గాను 254 మంది గైర్హాజరయ్యారు. 2,380 మంది హాజరై పరీక్ష రాశారు. కడప నగరంలో ప్రభుత్వ పురుషుల కళాశాల, ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాలలో పరీక్ష నిర్వహించగా ప్రొద్దుటూలో 3 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
కడప నగరంలో 1902 మందికి గాను 184 మంది గైర్హాజరు కాగా 1718 మంది హాజరై పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో 732 మందికి గాను 70 మంది గైర్హాజరు కాగా 662 మంది హాజరై పరీక్ష రాశారు. కాగా కడప నగరంలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థిని ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు.కాగా బీఎడ్ పరీక్ష అటు అభ్యర్థులతో పాటు వారి తల్లిదండ్రులు, సోదరులకు సైతం పరీక్షగా మారింది. బాలింతలు, చిన్నారుల తల్లులు బీఎడ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లడంతో వారి పిల్లలను తల్లిదండ్రులు లాలించారు.