'నేను బాత్రూమ్ లో దాక్కున్నా, వాడు వస్తున్నాడు'
ఆర్లెండో: కొడుకు ఎడీ జస్టిస్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చేటప్పటికి మినా జస్టిస్ గాఢ నిద్రలో ఉంది. తాను వెళ్లిన క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయని, చనిపోవడం ఖాయమని కొడుకు మెసేజ్ పెట్టడంతో ఆమె అమాంతంగా నిద్రలేచింది. ఫ్లోరిడాలోని ఆర్లెండో పల్స్ నైట్ క్లబ్ లో నరమేధం జరిగినప్పుడు అక్కడే ఉన్న 30 ఏళ్ల ఎడీ జస్టిస్ తన తల్లికి మెసేజ్ లు పంపాడు. వారిద్దరి మధ్య పలు మెసేజ్ లు నడిచాయి.
తెల్లవారుజామున 2.06 ప్రాంతంలో 'మమ్మీ ఐ లవ్ యూ' అంటూ మెసేజ్ పెట్టి, నైట్ క్లబ్ లో కాల్పులు జరుగుతున్నాయన్న విషయాన్ని తెలిపాడు. ఆమె ఫోన్ చేసినా సమాధానం రాలేదు. దీంతో నీవు బాగానే ఉన్నావా అంటూ మెసేజ్ పంపింది. మరో నిమిషానికి తాను బాత్రూమ్ లో దాక్కున్నానని సమాధానం వచ్చింది. ఈ క్లబ్ లో ఉన్నావని అడగ్గా 'పల్స్, డౌన్ టౌన్, పోలీసులకు ఫోన్ చేయి' జవాబిచ్చాడు. మరో నిమిషం తర్వాత 'నేను చనిపోతాను' అంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో భయపడిన మినా జస్టిస్ 911కు ఫోన్ చేసింది. 'నేను పోలీసులకు ఫోన్ చేస్తున్నా. నువ్వు అక్కడే ఉన్నావా, ఫోన్ చేయి' అంటూ కొడుక్కి ఆమె మెసేజ్ లు పంపింది. 2.39 గంటలకు అతడి నుంచి సమాధానం వచ్చింది.
'నేను బాత్రూమ్ లోనే ఉన్నా. వాడు ఇటే వస్తున్నాడు. నన్ను చంపేస్తాడు' అంటూ మెసేజ్ చేశాడు. 'నీతో పాటు ఎవరైనా ఉన్నారా, పోలీసులు వచ్చారా' మెసేజ్ పెట్టగా రాలేదని జవాబిచ్చాడు. తీవ్రవాది మాతో పాటే బాత్రూమ్ లో ఉన్నాడని చెప్పాడు. కాల్పులు జరుపుతోంది అతడేనా అని అడగ్గా 'యస్' అని సమాధానమిచ్చాడు. తర్వాత అతడి నుంచి ఎటువంటి మెసేజ్ రాలేదు. అయితే తన కొడుకు గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని మినా జస్టిస్ ఆందోళన చెందుతోంది. ఏం వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతోంది. తన కొడుకు ప్రాణాలతో ఉండాలని ప్రార్థిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున ఆర్లెండో నైట్ క్లబ్ లో ఉన్మాది జరిపిన కాల్పుల్లో 50 మందికిపైగా మృతి చెందగా, 53 మంది గాయపడ్డారు.