ప్లాస్టిక్ కంచెలు కాపాడేనా?
జోగిపేట: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను రక్షించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొక్కల సంరక్షణకు ముళ్లకంచెను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా డబ్బు కేటాయిస్తామని ప్రకటించారు.
నగర పంచాయతీలో నాటిన మొక్కల రక్షణకు మాత్రం ప్లాస్టిక్ ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. అవి ఎంత వరకు మొక్కలను కాపాడతాయనే విషయంపై అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ఇనుప ట్రీగార్డుల్లోనే మొక్కలను రక్షించడం కష్టమైన సమయంలో ప్లాస్టిక్ ట్రీగార్డులను పంపిణీ చేయడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం నగర పంచాయతీలో నాటిన మొక్కలకు ఐదు, ఆరు ప్లాస్టిక్ ట్రీగార్డులను ఏర్పాటు చేయనున్నారు. మేకలు, ఇతర పశువులు గట్టిగా లాగితే ఆ ట్రీగార్డులు ఊడి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
చిన్న మంట తగిలినా అది దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రభుత్వం ఇనుప ట్రీగార్డులనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నగర పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను కాపాడేందుకు 500 వరకు ప్లాస్టిక్ కంచెలనే ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. కార్యాలయంలో భద్రంగా ఉంచారు. ప్రతి మొక్కను కాపాడాలని ప్రభుత్వం ఒక వైపు ప్రకటిస్తుండగా... ఇలాంటి కంచెలు ఎంత వరకు ఆ మొక్కలను కాపాడతాయని పలువురు అంటున్నారు.