చదువుతోనే సంపూర్ణ అక్షరాస్యత
ఆదిలాబాద్ అర్బన్ : అందరూ చదువుకుంటేనే సంపూర్ణ అక్షరాస్యత సాధించవచ్చని కలెక్టర్ ఎం.జగన్మోహన్ పేర్కొన్నారు. సోమవారం ఆదిలాబాద్‌లోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం సాక్షరభారత్, జన్ శిక్షణ సంస్థాన్(ఎన్జీవో) ఆధ్వర్యంలో జరిగింది.
ముందుగా విద్యార్థులు, అధికారులు సాక్షరభారత్ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టర్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సంపూర్ణ అక్షరాస్యత సాధించినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. వయోజన విద్య ద్వారా, కస్తూరిబా బాలికా విద్యాలయాల ద్వారా డ్రాపౌట్ పిల్లలకు విద్యను అందించుట, సాధారణ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించుట వంటివి చేపడుతున్నట్లు వివరించారు.
ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరిస్తే అక్షరాస్యత సాధనలో మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. చదువుకున్న ప్రతీ ఒక్కరూ చదువు రాని వారికి చదువు చెప్పాలని కోరారు. మహిళల అక్షరాస్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అక్షరాస్యతతో ప్రజలందరిలో జాతీయ భావం పెరుగుతుందని అన్నారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, వయోజన విద్య ఉప సంచాలకులు శ్రీనివాస్‌రెడ్డి, జన శిక్షణ సంస్థాన్ కార్యదర్శి సురేందర్, సభ్యులు రాజేశ్వర్, గంగాధర్, అలీబాన్, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల యజమానులు పాల్గొన్నారు.