అండర్ గ్రౌండ్ నుంచి బాలుడికి విముక్తి
సిడ్నీ: మత్తు పదార్థాల ముఠా స్థావరంపై దాడి చేసిన ఆస్ట్రేలియా పోలీసులు అండర్ గ్రౌండ్ లో బంధించిన 8 ఏళ్ల బాలుడికి విముక్తి కల్పించారు. బాలుడిని బంధించిన తీరు చూసి పోలీసులు అవాక్కయ్యారు. సిడ్నీకి ఉత్తర దిక్కుగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాండ్స్ ప్రాంతంలో ఓ మారుమూల ఇంటిపై పోలీసులు దాడి చేసినప్పుడు ఈ దారుణోదంతం వెలుగు చూసింది.
రెండు చదరపు అడుగుల గదిలో బంధించివున్న బాలుడిని పోలీసులు గుర్తించారు. చిన్న పరుపు, బకెట్ మాత్రమే గదిలో ఉంచారు. మూడు వారాల పైనుంచి తనను అందులో బంధించారని పోలీసులకు బాలుడు తెలిపాడు. అతడితో పాటు మరో ముగ్గురు పిల్లలను పోలీసులు కాపాడారు. సరిగా తిండి లేకపోవడంతో వీరంతా నీరసించిపోయారు.
ఇంటి ప్రాంగణంలో నిషేధిత గంజాయి మొక్కలు పెంచినట్టు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు పురుషులు, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత మొక్కలు పెంచినందుకు, బాలలను నిర్బంధించినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. తాము దాడి చేసిన ఇంటి ఫొటోలు పోలీసులు విడుదల చేశారు.