నరకయాతన
అంధకారంలో అనకాపల్లి
వాణిజ్య కేంద్రానికి తప్పని చీకట్లు
తాగు నీటికి జనం అవస్థలు
జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి ఇప్పటికీ అంధకారంలోనే మగ్గుతోంది. తొమ్మిది రోజులవుతున్నా.. పట్టణంలో చీకట్లు తొలగలేదు.చీకటిపడితే జనం అడుగుతీసి బయటపెట్టలేని దుస్థితి. తాగు నీటికి నోచుకోక నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా రోజువారి అవసరాలకు వాడుక నీరు దొరక్క పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామన్న అధికారుల మాటలు అమలు కాలేదు. పనులు చేపడుతున్నా సాంకేతిక సమస్యలు వెంటాడుతూనే వున్నాయి.
అనకాపల్లి : పట్టణంలోని 60 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. 700 పైగా స్తంభాలు విరిగిపోయాయి. దీంతో రూ.3 కోట్ల మేర ఆ శాఖకు నష్టం వాటిల్లింది. విద్యుత్ డిమాండ్‌తో కశింకోట సబ్‌స్టేషన్ నుంచి అనకాపల్లికి ఇంతకాలం విద్యుత్ సరఫరా చేసేవారు. ప్రస్తుతం కశింకోట సబ్‌స్టేషన్ కూడా ధ్వంసమైంది. అక్కడి నుంచి విద్యుత్ వచ్చే అవకాసం లేకుండా పోయింది. రెండురోజుల క్రితమే వాటర్‌హౌస్‌కు విద్యుత్ సరఫరాకు అధికారులు భావించినా శారదానది మీదుగా విద్యుత్ తీగలు పడిపోవడంతో అధికారులు విఫలమయ్యారు. అనకాపల్లికి చారిత్రకంగా, వ్యాపారపరంగా గుర్తింపు ఉంది.
ఇక్కడి జాతీయస్థాయి బెల్లం మార్కెట్లో రోజూ పెద్ద ఎత్తున లావాదేవీలు సాగుతాయి. జిల్లాస్థాయిలో కూరగాయల వ్యాపారం, ఇతర వాణిజ్య కలాపాలు కొనసాగుతుంటాయి. లక్షకు పైగా జనాభా ఉన్న ఈ పట్టణంలో దాదాపు జిల్లాస్థాయి ప్రధాన కార్యాలన్నీ ఉన్నాయి. దీనికితోడు వ్యాపార కలాపాల కోసం జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి పలువురు వస్తుంటారు.
గురువారం నాటికే విద్యుత్ సరఫరా చేస్తామని నేతలతో పాటు అధికారులు చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా విద్యుత్ పునరుద్ధరణలో ఆశాఖ అధికారులు విఫలమయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో ఆగ్రాహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు సీఎం చంద్రబాబునాయుడు, రాష్ర్టంలోని పలువురు మంత్రులు అనకాపల్లి మీదుగా పయనిస్తున్నా విద్యుత్ పునరుద్ధరణ విషయంలో అధికారులు చేతులెత్తేయడం శోచనీయం.
వాతావరణం అనుకూలించకే : డీఈ రాజ్‌కుమార్...
రెండు రోజులుగా వాతావరణం అనుకూలించకపోవడం వల్లే విద్యుత్ సరఫరా ఆలస్యమైందని డీఈ రవికుమార్ తెలిపారు. పరవాడ 22 కేవీ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితులలోను ఆదివారం రాత్రికి లేదా సోమవారం నాటికి విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు.