త్వరలో ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో అన్ని పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లను జారీ చేయాలని విదేశాంగ శాఖ యోచిస్తోంది. పూర్తిస్థాయిలో సాంకేతిక వ్యవస్థను రూపొందించుకుని, పాస్‌పోర్ట్‌ల తయారీకి వివిధ సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్టును 2015 సంవత్సరానికల్లా పూర్తి చేయాలనే యోచనలో ఉన్నట్టు విదేశాంగ శాఖకు చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. నకిలీ పాస్‌పోర్ట్‌లు లేకుండా చేయడమే ఈ-పాస్‌పోర్ట్‌ల లక్ష్యమని, త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలను తమ శాఖ వెల్లడిస్తుందని చెప్పారు.
ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్‌లు ఇలా ఉంటాయి
వేలిముద్రలతో కూడిన చిప్‌ను పాస్‌పోర్ట్‌లో అమర్చుతారు. పాస్‌పోర్ట్‌లోని రెండో పేజీలో డిజిటల్ సంతకం, షేడెడ్ ఫొటోగ్రఫీ, ఐరిస్ (కంటిపాప) ముద్ర తదితరాలు ఉంటాయి.
వేలిముద్రలతో కూడిన చిప్‌ను కవర్ పేజీ లేదా చివరి కవర్లో అమర్చుతారు.
బయోమెట్రిక్, ఐరిస్, ఫొటోగ్రఫీకి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి నకిలీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండదు. ఎయిర్‌పోర్ట్‌లో చిప్‌తో కూడిన ఆధారాలను పరిశీలించాకే అనుమతిస్తారు.ప్రస్తుతం ఉన్న పాస్‌పోర్ట్‌లను కూడా ఈ-పాస్‌పోర్ట్‌లుగా మార్చే ఆలోచన కూడా ఉంది.