చలానాలకు మంగళం
ఈ-స్టాంపింగ్‌కు శ్రీకారం
త్వరలో రిజిస్ట్రేషన్ల రుసుం చెల్లింపు విధానంలో మార్పు
అనంతపురం టౌన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. అదనపు వసూళ్లు అరికట్టడం, పారదర్శకత పెంచడం, నకిలీలకు అడ్డుకట్ట వేయడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల్లో చెల్లించే చలానాలకు మంగళం పలికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నగదు చెల్లించే విధానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యూనిక్ ఐడెంటిటీ, బార్ కోడింగ్ విధానంలో ఈ-స్టాంపింగ్ ద్వారా దస్తావేజులు తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అనంతపురం జిల్లాకు చేరాయి.
ఏటా రూ.కోట్లలో ఆదాయం
ఏటా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. 2015-16 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.175 కోట్ల లక్ష్యం పెట్టింది. అనంతపురం డీఆర్ (జిల్లా రిజిస్ట్రార్) లక్ష్యం రూ. 106 కోట్లు కాగా రూ.114 కోట్లు సాధించారు. ఇక హిందూపురం డీఆర్ లక్ష్యం రూ.69 కోట్లు కాగా రూ.64.14 కోట్లు సాధించారు. మొత్తంగా చూసుకుంటే టార్గెట్‌కు మించి రూ. 178.16 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) భారీ లక్ష్యాన్నే ఉంచారు. మొత్తంగా రెండు రిజిస్ట్రార్ జిల్లాల పరిధిలో రూ. రూ.283 కోట్లను టార్గెట్ పెట్టారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు బ్యాంకు చలాన్లను సమర్పించే విధానానికి స్వస్తి పలికి..వాటి స్థానంలో సబ్ రిజిస్ట్రార్ కారాలయాల్లోనే ‘ఈ- స్టాంపింగ్’ ద్వారా చెల్లింపు విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. తొలి విడతగా పది బ్యాంకులను గుర్తించినట్లు తెలిసింది.
అన్ని కార్యాలయాలకూ పంపాం
ఈ- స్టాంపింగ్ విధానం త్వరలోనే అమల్లోకి వస్తుంది. ఉత్తర్వులు అందాయి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కూ పంపించాం. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. అమలుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ-స్టాంపింగ్ అమల్లోకి వస్తే చలాన్లను బ్యాంకులో చెల్లించే అవసరం ఉండదు. - గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్స్