eleti annapurnamma
-
ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎత్తేయాలి
ఆర్మూర్ : టీడీపీ శాసనసభ్యులపై వెంటనే స స్పెన్షన్ ఎత్తివేయాలని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. ఆమె సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఓ వైపు విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వాస్తవ పరిస్థితులతో పాటు సమస్య పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను వివరించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందో అర్థం కావడం లేదన్నారు. ఈ విషయమై అసెంబ్లీలో టీడీపీ ప్రశ్నిస్తోందని, దీంతో సభలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో వృద్ధులు, వికలాంగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. అధికారంలోకి రాగానే ‘మన ఊరు మన ప్రణాళిక’ పేరుతో సమస్యలు తెలుసుకున్నారని, వాటి పరిష్కారానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీకి రూ. 20 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలోనూ రూ. 20 కోట్లే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్, సరఫరాపై శ్వేత పత్రం విడుదల చేసి ప్రజలకు నిజానిజాలు తెలియజేశారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ కోతలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రజలకు స్పష్టతనివ్వడానికి తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సభ్యత్వం.. అన్నపూర్ణమ్మ ఆన్లైన్ పద్ధతిలో టీడీపీ క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల సుధాకర్, కౌన్సిలర్ జీవీ నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు కిషోర్‌రెడ్డి, నాయకులు జితేందర్‌రెడ్డి, గుండెం రమేశ్, పసుపుల రవి పాల్గొన్నారు. -
పొత్తు లేదా..చిత్తే!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. నాయకులు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. కార్యకర్తలు సైతం వారిని అనుసరించారు. దీంతో జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జిల్లానుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలతో ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ఒత్తిడితో ఒక్కరొక్కరుగా పార్టీని వీడారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేలు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతలెందరో పార్టీని విడిచిపెట్టారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ప్రస్తుతం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నేతల్లో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కొనసాగుతున్న నేతలు సైతం.. ‘తెలంగాణ’లో పూర్తిగా దెబ్బతిన్న పార్టీలో కొన సాగడమా? పార్టీ మారడమా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం. ఆ నియోజకవర్గాల్లో.. ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. 1983 నుంచి 1999 వరకు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ ప్రస్తుతం తెలుగు దేశానికి అభ్యర్థి దొరకని పరిస్థితి ఉంది. కామారెడ్డి నియోజకవర్గం కూడా ఒకప్పుడు టీడీ పీ కంచుకోటే. 1983 నుంచి ఆ పార్టీ ఐదుసార్లు గెలిచింది. 2009లో పార్టీ టికెట్టుపై గెలిచిన గంప గోవర్ధన్ టీఆర్ఎస్లో చేరిపోయారు. తర్వాత నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న నిట్టు వేణుగోపాల్‌రావు బీజేపీలో చేరారు. దీంతో ఇక్కడ సైతం పార్టీకి సరైన అభ్యర్థి కరువయ్యారు. బోధన్‌లో టీడీపీ నాలుగు సార్లు గెలిచింది. 1994 తర్వాత విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం బలమైన నాయకులు లేరు. బాన్సువాడకు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు ఆ పార్టీనే గెలిచింది. 1978 తర్వాత 2004 లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ 2009లో టీడీపీ టికెట్టుపై గెలిచిన పోచారం తర్వాత పార్టీకి పదవికి రాజీ నామా చేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పార్టీకి బలమైన అభ్యర్థి దొరకడం లేదు. జుక్కల్‌లో టీడీపీ నాలుగుసార్లు గెలిచింది. 2009లో పార్టీ తరపున గెలిచిన హన్మంత్ సింధే టీఆర్ఎస్లో చేరారు. దీంతో ఇక్కడ సైతం నాయకత్వ లేమి ఉంది. డోలాయమానంలో ఆర్మూరు ఎమ్మెల్యే అర్మూరు ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పరిస్థితి డోలాయమానంలో ఉంది. బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ కోటాలో పార్టీ అధినేత చంద్రబాబు ఉస్మానియా జేఏసీ నేత రాజారాం యాదవ్‌కు హామీ ఇచ్చారు. ఆయన ఆర్మూర్ టికెట్టు ఆశిస్తున్నారు. దీంతో అన్నపూర్ణమ్మను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఆమె ససేమిరా అంటున్నట్లు తెలిసింది. రూరల్‌నుంచి పోటీకి మండవ విముఖత! మండవ వెంకటేశ్వరరావు ఈసారి నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరని సమాచారం. ఇక్కడ మండవ స్థానం లో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. అర్బన్‌లో.. నిజామాబాద్ అర్బన్‌లో టీడీపీ మూడు పర్యాయాలు గెలుపొందింది. 1994 తర్వాత ఇక్కడ విజయం కరువైంది. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీడీపీ టికెట్ ఆశిస్తున్నా.. ఆయనకు పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించలేదు. పార్లమెంటుకూ వెతుక్కోవాల్సిందే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్లు ససేమిరా అంటున్నారు. 1984, 1989, 1996లలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందింది. 1998 నుంచి అన్నీ అపజయాలే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరరావులపై అధిష్టానం ఒత్తిడి చేస్తున్నా.. ఎంపీగా పోటీ చేసేందుకు వారు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఇలా అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉండడంతో పార్టీ మనుగడపై తెలుగు తమ్ముళ్లు దిగులు చెందుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే తప్ప పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.