సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన రెండుకళ్ల సిద్ధాంతం ఆ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. నాయకులు ఒక్కరొక్కరుగా ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. కార్యకర్తలు సైతం వారిని అనుసరించారు. దీంతో జిల్లాలో టీడీపీ నామమాత్రంగా మిగిలింది.
2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జిల్లానుంచి ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలతో ఆ పార్టీ తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల ఒత్తిడితో ఒక్కరొక్కరుగా పార్టీని వీడారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధేలు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, ముఖ్య నేతలెందరో పార్టీని విడిచిపెట్టారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. ప్రస్తుతం పార్టీకి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో నేతల్లో ఆశలు సన్నగిల్లిపోతున్నాయి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీలో కొనసాగుతున్న నేతలు సైతం.. ‘తెలంగాణ’లో పూర్తిగా దెబ్బతిన్న పార్టీలో కొన సాగడమా? పార్టీ మారడమా? అన్న మీమాంసలో ఉన్నట్లు సమాచారం.
ఆ నియోజకవర్గాల్లో..
ఎల్లారెడ్డి నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. 1983 నుంచి 1999 వరకు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. ఇక్కడ ప్రస్తుతం తెలుగు దేశానికి అభ్యర్థి దొరకని పరిస్థితి ఉంది.
కామారెడ్డి నియోజకవర్గం కూడా ఒకప్పుడు టీడీ పీ కంచుకోటే. 1983 నుంచి ఆ పార్టీ ఐదుసార్లు గెలిచింది. 2009లో పార్టీ టికెట్టుపై గెలిచిన గంప గోవర్ధన్ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తర్వాత నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నిట్టు వేణుగోపాల్‌రావు బీజేపీలో చేరారు. దీంతో
ఇక్కడ సైతం పార్టీకి సరైన అభ్యర్థి కరువయ్యారు.
బోధన్‌లో టీడీపీ నాలుగు సార్లు గెలిచింది. 1994 తర్వాత విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం బలమైన నాయకులు లేరు.
బాన్సువాడకు టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎనిమిది పర్యాయాలు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు ఆ పార్టీనే గెలిచింది. 1978 తర్వాత 2004 లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఇక్కడ 2009లో టీడీపీ టికెట్టుపై గెలిచిన పోచారం తర్వాత పార్టీకి పదవికి రాజీ నామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో పార్టీకి బలమైన అభ్యర్థి దొరకడం లేదు.
జుక్కల్‌లో టీడీపీ నాలుగుసార్లు గెలిచింది. 2009లో పార్టీ తరపున గెలిచిన హన్మంత్ సింధే టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో ఇక్కడ సైతం నాయకత్వ లేమి ఉంది.
డోలాయమానంలో ఆర్మూరు ఎమ్మెల్యే
అర్మూరు ఎమ్మెల్యే ఏలేటి అన్నపూర్ణమ్మ పరిస్థితి డోలాయమానంలో ఉంది. బీసీలకు వంద సీట్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆ కోటాలో పార్టీ అధినేత చంద్రబాబు ఉస్మానియా జేఏసీ నేత రాజారాం యాదవ్‌కు హామీ ఇచ్చారు. ఆయన ఆర్మూర్ టికెట్టు ఆశిస్తున్నారు. దీంతో అన్నపూర్ణమ్మను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పంపుతారని ప్రచారం జరుగుతోంది. అయితే అందుకు ఆమె ససేమిరా అంటున్నట్లు తెలిసింది.
రూరల్‌నుంచి పోటీకి మండవ విముఖత!
మండవ వెంకటేశ్వరరావు ఈసారి నిజామాబాద్ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సుముఖంగా లేరని సమాచారం. ఇక్కడ మండవ స్థానం లో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది.
అర్బన్‌లో..
నిజామాబాద్ అర్బన్‌లో టీడీపీ మూడు పర్యాయాలు గెలుపొందింది. 1994 తర్వాత ఇక్కడ విజయం కరువైంది. ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి టీడీపీ టికెట్ ఆశిస్తున్నా.. ఆయనకు పార్టీ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించలేదు.
పార్లమెంటుకూ వెతుక్కోవాల్సిందే
నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్లు ససేమిరా అంటున్నారు. 1984, 1989, 1996లలో ఈ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందింది. 1998 నుంచి అన్నీ అపజయాలే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అన్నపూర్ణమ్మ, మండవ వెంకటేశ్వరరావులపై అధిష్టానం ఒత్తిడి చేస్తున్నా.. ఎంపీగా పోటీ చేసేందుకు వారు ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఇలా అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉండడంతో పార్టీ మనుగడపై తెలుగు తమ్ముళ్లు దిగులు చెందుతున్నారు. బీజేపీతో పొత్తు కుదిరితే తప్ప పార్టీ బతికి బట్టకట్టడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
పొత్తు లేదా..చిత్తే!
Published Sat, Mar 15 2014 2:18 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement
Advertisement