బువ్వ పెట్టేదెలా?
పది నెలలుగా అందని మధ్యాహ్న భోజనం బిల్లులు
ఏజెన్సీలకు రూ.25 కోట్ల బకాయిలు
అప్పుల ఊబిలో నిర్వాహకులు
చిత్తూరు(ఎడ్యుకేషన్): ‘గంగమ్మ (పేరు మార్చాం) ఒకప్పుడు ఒంటినిండా బంగారు ఆభరణాలు.. పుస్తకాలతో మండల కార్యాలయం వద్ద అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేసేది. తమ ఊరిలో ఉన్న హైస్కూల్లో మధ్యాహ్న భోజన బాధ్యతను నెత్తికెత్తుకుంది. స్కూల్లో 500 మందికి మించి పిల్లలు ఉన్నారు. వీరందరికీ రోజూ భోజనం వండి పెట్టాలి. కూరల్లోకి కావాల్సిన అన్ని వస్తువులను కొనుక్కుని పెడితే నెలాఖరులో ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. నెలకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ బిల్లుల చెల్లింపు విషయంలో కాసింత వెనుకబాటుతనం ఉన్నప్పటికీ కొన్ని నెలల ఆలస్యంతోనైనా చేతికి అందేది. నిర్వహణ ఖర్చుల కోసం ఒంటిమీదున్న నగలు ఒలిచి మార్వాడికి కుదువపెట్టి మళ్లీ విడిపించుకునేది. ఇప్పుడు తొమ్మిది నెలలుగా విద్యాశాఖ బిల్లులు చెల్లించకపోవడంతో ఒంటిమీదున్న నగలు షేట్ అంగట్లో బందీ అయ్యాయి. పిల్లలను పస్తులు పెట్టలేక పరపతి ఉన్న ప్రతి ఒక్కరి వద్దా వడ్డీకి అప్పులు చేసి పెట్టింది. అప్పు ఇచ్చిన వాళ్లు ఇంటిమీదకు వచ్చి గొడవ చేస్తుంటే యజమాని చేత చావుదెబ్బలు తింటూ నరకయాతన అనుభవిస్తోంది.’
ఈ సమస్య ఈమె ఒక్కరిదే కాదు. జిల్లాలో ఉన్న వేలాదిమంది వంట నిర్వాహకులదీ దాదాపు ఇదే పరి స్థితి. సుమారు పది నెలల నుంచి ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయిల చెల్లించకపోవడంతో భోజన నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
చేతిలో రూపాయి లేకుంటే ఓ చిన్నకుటుంబంలోనే పూటగడవటం కష్టతరం. అలాంటిది వందల సంఖ్యలో పిల్లలుండే ప్రభుత్వ పాఠశాలల్లో నెలల తరబడి అప్పులుచేసి వండి వార్చాలంటే ఎంత భారం.. నాణ్యతను ప్రశ్నించే అధికారులు పెండింగ్ బిల్లులను పరిష్కరించడంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేస్తున్న మధ్యాహ్నభోజన పథకం అంపశయ్యపై చేరింది. నిర్వాహకులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదపిల్లలను పస్తులు పెట్టేందుకు మనసొప్పక నిర్వాహకులు సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఉన్న 5,098 ప్రభుత్వ పాఠశాలకు రూ.25 కోట్లు బకాయిలు రావాల్సి ఉంది.
జిల్లాలోని 3,999 ప్రాథమిక, 491 ప్రాథమికోన్నత పాఠశాలకు రెండు నెలలుకు సంబంధించి రూ.13.5 కోట్లు, గత ఏడాది జూలై నుంచి 608 ఉన్నత పాఠశాలలకు రూ.6.5 కోట్లు బిల్లులు, ఏజెన్సీ నిర్వాహకులకు అందించే గౌరవ వేతనాలు రూ.4.9 కోట్లు మొత్తంగా రూ.25 కోట్లు బకాయిలున్నాయి. డ్వాకా మహిళా సంఘాలకు చెందిన సభ్యులు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో భోజన తయారీ నిర్వహణ బాధ్యతను తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆంక్షల కారణంగా మంజూరైన నిధులూ ఖజానా నుంచి విడుదల కావడంలేదు. సైతం విడుదల కావడంలేదు.
గౌరవ వేతనాలకు దిక్కులేదు
మధ్యాహ్నభోజన నిర్వాహకులకు నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తారు. ఈ మొత్తం కూడా ఇవ్వకపోవడంతో అప్పులు తడిసి మోపెడవుతున్నాయి. ప్రాథమిక స్థాయి వి ద్యార్థికి భోజనం ఖర్చు రూ.4.60, ఉన్నతపాఠశాల విద్యార్థికి రూ.6.38 ఎలా సరిపోతుందో అధికారులే తేల్చాల ని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తంలోనే కూరగాయలు, పప్పు దినుసులు, అరటిపండ్లు, గుడ్లు కొనాల్సిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ బకాయిల చెల్లింపు విషయంలో అధికారులు చొరవ చూపాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి.
అప్పులపాలయ్యాం
నెలల తరబడి భోజనం బిల్లులు రాకపోవడంతో స్కూల్ పిల్లలను పస్తులు పెట్టడం ఇష్టం లేక వేలాది రూపాయలు అప్పులపాలయ్యాం. అధికారులు చొరవ తీసుకుని మధ్యాహ్నభోజనానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలి.
-శశికళ,మధ్యాహ్నభోజన నిర్వాహకురాలు,
బీఎన్నార్పేట, చిత్తూరు మండలం
అధికారులు పట్టించుకోవాలి
నెలల తరబడి ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతుల విద్యార్థులకు సంబంధించి మధ్యాహ్నభోజనం బిల్లులు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. లేకుంటే జిల్లాలో చాలా పాఠశాలల్లో మధ్యాహ్నభోజన పథకం ఆగిపోయే ప్రమాదం ఉంది.
-రెడ్డిశేఖర్రెడ్డి,
వైఎస్సార్ టీచర్స్ఫెడరేషన్ రాష్ట్రనాయకులు