కర్ణాటకలో... ఎల్లమ్మ జాతర..
ఎల్లమ్మ దేవతకు మన దగ్గర పూజలు జరపడం, జాతరలు నిర్వహించడం చేసినట్టుగానే కర్ణాటక రాష్ట్రంలోనూ ఎల్లమ్మకు పండగ జరుపుతారు. డిసెంబర్ నెలలో వచ్చే మార్గశిర పౌర్ణమి (ఈ నెల 6న పౌర్ణమి) రోజున పెద్ద ఎత్తున జరిగే జాతరకు ఎక్కడెక్కడి నుంచో జనం తండోపతండాలుగా తరలివస్తారు. ఇక్కడ అమ్మవారిని శక్తి స్వరూపిణిగా కోరి కొలుస్తారు భక్తులు. ఆధ్యాత్మికతకు నెలవైన ఆ ప్రాంత విశేషాలు...
కర్ణాటక రాష్ట్రంలో బెల్గామ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో సౌనదత్తి అనే పట్టణం ఉంది. ఈ పట్టణాన్ని సవదత్తి అని కూడా అంటారు. ఈ ప్రాంతానికి 5 కి.మీ దూరంలో ఎల్లమ్మ గుట్టపైన ఎల్లమ్మదేవి కొలువుదీరిన అతి ప్రాచీన ప్రసిద్ధ దేవాలయం ఉంది. ఇక్కడ ఎల్లమ్మను రేణుకా మాతగానూ కొలుస్తారు. మన దగ్గరా రేణుకామాతకు పూజలు నిర్వహించడం ప్రసిద్ధమే! పురాణాలలో రేణుకామాత జమదగ్ని భార్యగా చెబుతారు. ఇక్కడ రే ణుకామాతను దుర్గామాతగా కొలుస్తారు.
పౌర్ణమి వెలుగుల్లో...
అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు 5 సార్లు పౌర్ణమి రోజులలో ఎల్లమ్మ వేడుకలు జరుపుతారు. అయితే, మార్గశిర మాసమైన డిసెంబర్లో వచ్చే పౌర్ణమి (ఈ ఏడాది డిసెంబర్ 6న పౌర్ణమి)నాడు పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తారు స్థానికులు. అంగరంగ వైభవంగా జరిగే సౌనదత్తి ఎల్లమ్మ జాతరకు ఆ ప్రాంతవాసులే గాక పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవాల నుంచి భక్తులు తరలివచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. భారతదేశ సంస్కృతి తెలుసుకోవడానికి ఇలాంటి జాతరలు ఎంతో కీలకమని నమ్మే విదేశీయుల సైతం పరిశోధనల కోసం ఈ ప్రాంతానికి విచ్చేస్తుంటారు. సవదత్తి ఎల్లమ్మ జాతరలో ప్రాచీన కాలం నుంచి దేవదాసీ వ్యవస్థ కొనసాగుతుంది. ఇప్పటికీ జాతర సమయాలలో కొనసాగే దేవదాసీ వ్యవస్థకు అడ్డుకట్ట వేయడానికి, అక్కడి ప్రజలలో అవగాహన తేవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి.
చూడదగినవి
ఈ దేవాలయంలో చాళుక్యులు, రాష్ట్రకూటుల నిర్మాణ శైలి కనపడుతుంది. శిల్పాలలో జైనుల సంస్కృతి కళ్లకు కడుతుంది. సవదట్టి ఎల్లమ్మ దేవాలయం పరిసరాలలో ప్రసిద్ధ గణపతి, మల్లికార్జున, పరశురామ, ఏక్నాథ్, సిద్ధేశ్వర దేవాలయాలు ఉన్నాయి.
సవదత్తికి: బెంగళూరు - 500 కి.మీ, తూముకూర్ - 397 కి.మీ చిక్మగళూర్ - 355 కి.మీ, మంగళూర్ - 401 కి.మీ
కర్వార్ - 209 కి.మీ, బళ్లారి - 245 కి.మీ, ధార్వాడ్ - 38 కి.మీ, బిజాపూర్ - 165 కి.మీ, రాయ్‌చూర్ - 297 కి.మీటర్ల దూరంలో ఉన్నాయి. సమీప విమానాశ్రయం: బెల్గామ్ సమీప రైల్వే స్టేషన్: ధార్వాడ్ సవదత్తికి అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.