జగన్ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
యల్లనూరు:
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి సాధ్యమని శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి అన్నారు.
మండలంలోని కొడవండ్లపల్లి, ఆరవేడు, బుక్కాపురం, నేర్జాంపల్లి గ్రామాల్లో శనివారం ఆమె గడపగడపకూ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తమ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టే ప్రజాసంక్షేమ పథకాలను వివరించారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ల పెంపు, అమ్మ ఒడి, రైతులకు వడ్డీలేని రుణాలు, వ్యవసాయ సూచనలు, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, పంటలకు మద్దతు ధర కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు, డ్వాక్రా రుణాల మాఫీ, తదితర పథకాలను విశదీకరించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలను కాంగ్రెస్ పాలకులు తుంగలో తొక్కారన్నారు. సంక్షేమ పథకాలు తిరిగి ప్రజలకు అందుబాటులోకి రావాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాల్సి ఉందని, ఇందుకు ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.
తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం..
ఆరవేడు, బుక్కాపురంలో నెలకొన్న తాగునీటి సమస్యలను ఆ గ్రామ మహిళలు పద్మావతి దృష్టికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారానికి గతంలో హామీ ఇచ్చిన నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై పద్మావతి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు.