మాతా శిశుమరణాల నివారణకు కృషి
ఏలూరు అర్బన్: కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాల మేరకు మాతాశిశు మరణాలు కనీస స్థాయికి తగ్గించే లక్ష్యంతో పథకాలు అమలు చేస్తున్నామని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) కె.శంకరరావు అన్నారు. ఏలూరు జిల్లా ఆస్పత్రిలోని మాతాశిశు కేంద్రం (ఎంసీహెచ్)తో పాటు పలు విభాగాలను గురువారం ఆయన పరిశీలించారు. ఎంసీహెచ్‌లో గర్భిణులు, బాలింతలతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. నవజాత శిశువులకు టీకాలు ఇచ్చేందుకు కింది అంతస్తులోకి వెళ్లాల్సి వస్తోందని బాలింతలు ఫిర్యాదు చేయడంతో సంబంధిత ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్ల వద్దే శిశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం న్యూబోర్న్ బేబీ సెంటర్లోని ఫొటోథెరపీ, ఇంక్యుబేటర్, నూతనంగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సెప్టిక్, బర్న్స్ వార్డులు, మార్చురీలో పరిస్థితులను పరిశీలించారు. అన్ని వార్డుల్లో పారిశుధ్యం ఎలా ఉందనే అంశంపై రోగులతో మాట్లాడారు. పారిశుధ్యం క్షీణిస్తే ఉద్యోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్ ఆయన వెంట ఉన్నారు.