ఎన్నికలెందుకు.. వేలం వేస్తే పోలా?
ఇంత ప్రజాధనం ఖర్చుచేసి ఎన్నికలు నిర్వహించడానికి బదులు ఎన్నికల కమిషన్ అసెంబ్లీ సీట్లను వేలం వేసి ఉండాల్సిందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఘాటుగా విమర్శించింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. తాము మాత్రం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రంలో పని చేస్తూనే ఉంటామని పార్టీ గోవా కన్వీనర్ ఎల్విస్ గోమెజ్ అన్నారు. గోవాలో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన ఆమ్ ఆద్మీ పార్టీ.. కనీసం అక్కడ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. ఇంత ఘోరమైన ఓటమి చవిచూసిన తర్వాత గోమెజ్ సోమవారం సాయంత్రం తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. ఎవరు ఎన్నిక కావాలన్న విషయాన్ని నిర్ణయించడంలో డబ్బు చాలా కీలక పాత్ర పోషించిందని, డబ్బు ప్రభావాన్ని నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
అసలు ఈ ఎన్నికలన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారని ఒక్కోసారి తనకు ఆశ్చర్యం వేస్తుందని, దానికి బదులు ఎన్నికల కమిషన్ మొత్తం అన్ని సీట్లకు వేలం నిర్వహిస్తే సరిపోతుంది కదా అన్నారు. అందరికంటే ఎక్కువ పాట పాడుకున్నవాళ్లు గెలిచినట్లు ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ర్యాలీలు నిర్వహించడం ఇదంతా ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ప్రజలకు ఏం కావాలో తమకు అర్థం కాలేదని గోమెజ్ అన్నారు. గోవా ప్రజలకు తాము సరైన ప్రత్యామ్నాయం ఇద్దామనుకున్నామని.. రాజకీయ యవనికపై తాము కొత్త ముఖాలను తీసుకొద్దామనుకున్నామని, అందుకే ఎలాంటి నేరచరిత్ర లేని అభ్యర్థులకే టికెట్లు ఇచ్చామని తెలిపారు. అలాగే కులమతాల ఆధారంగా కూడా టికెట్లు ఇవ్వలేదన్నారు. ఇవన్నీ కాకుండా ప్రజలకు ఏం కావాలో తమకు తెలియలేదని, ప్రజలను మరింత బాగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తామని తెలిపారు.