ఆర్థిక సంక్షోభంలో ‘గ్రేటర్’
* అత్యవసర రోడ్ల మరమ్మతులకు నిధుల కొరత
* రూ. 300 కోట్లకు పైగా బకాయిలున్న రాష్ట్ర ప్రభుత్వం
* తక్షణమే చెల్లించాలని జీహెచ్ఎంసీ అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్: మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భారీ వర్షాలతో ఛిద్రంగా మారిన నగర రహదారులకు అత్యవసర మరమ్మతులు చేపట్టేందుకు దగ్గర నిధులు లేకుండా పోయాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో నగర రోడ్లన్నీ నరకప్రాయంగా మారడంతో సంస్థ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. యుద్ధప్రాతిపదికన రోడ్లకు మరమ్మతులు చేపట్టేందుకు సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు నిధుల కొరత అడ్డంకిగా మారింది.
కొద్దో గొప్పో ఉన్న నిధులను మరమ్మతు పనులకు ఖర్చు చేసేస్తే, వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమని సంస్థ అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్ల బకాయిలు తక్షణమే విడుదల చేయాలని జీహెచ్ఎంసీ యాజమాన్యం తాజాగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్ఎంసీకి రూ.450 కోట్ల గ్రాంట్లు విడుదల కాగా 2015-16, ఆ తర్వాత కేవలం రూ.40 కోట్లే విడుదలయ్యాయి. వృత్తి పన్ను, వినోద పన్నులు, స్టాంపు డ్యూటీల్లో సంస్థ వాటాలు, 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు, రోడ్ ట్యాక్స్ వాటాల రూపంలో రూ.300 కోట్లకు పైగా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి చెల్లించాల్సి ఉంది.
ఈ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించేందుకు గతేడాది జీహెచ్ఎంసీ ఆదాయం నుంచి రూ.365 కోట్లను కేటాయించడంతో.. ప్రస్తుతం సంస్థ మరింత ఆర్థిక చిక్కుల్లో చిక్కుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బకాయిల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సైతం మాట్లాడినట్లు తెలిసింది. దీంతో శుక్రవారం సాయంత్రం లోగా జీహెచ్ఎంసీకి రూ.150 కోట్ల బకాయిలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లు తెలిసింది.