హిందూ ధర్మాన్ని మహిళలే కాపాడుతున్నారు
అపనమ్మకాలతో ధర్మాన్ని మరస్తున్నారు
మధ్వ విజయాన్ని అందరూ కంఠస్థం చేయాలి
సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వెంకటాచలయ్య
సాక్షి, బళ్లారి : హింధూ ధర్మాన్ని మహిళలే కాపాడుతున్నారని, ప్రతిరోజు మహిళలు పూజలు, వ్రతాలు చేయడం వల్ల మహిళలు మన ధర్మాన్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారని సుప్రీం కోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి ఎం.ఎస్.వెంకటాచలయ్య అన్నారు. ఆయన మధ్వ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నగరంలోని శ్రీ వ్యాస-దాస మంటంలో ఏర్పాటు చేసిన 1008 సువిదేంద్ర తీర్థ మహాస్వామీజీ 13వ చాతుర్మాస వ్రత దీక్షలను ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.వెంకటాచలయ్య మాట్లాడుతూ అన్ని కులాల వారు అప నమ్మకాలతో తమ ధర్మాలపై నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధ్యాత్మికత వైపు, ధర్మాలను రక్షించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ప్రతి రోజు పూజలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్న విషయం మహిళల ద్వారా తెలుస్తుందన్నారు. అలాంటి మహిళలకు మనందరం సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతిరోజు ధ్యానం, దైవ పూజల వల్ల ప్రతి మనిషి మానసికంగా, ప్రశాంతంగా ఉంటాయన్నారు. మధ్వ విజయాన్ని ప్రతి ఒక్కరూ కంఠస్థం చేస్తే ఆయా కుటుంబాల్లో శాంతి సుఖాలు వెల్లివిరుస్తాయన్నారు.
అంతకు ముందు జయతీర్థాచార్, నిప్పాణి గురు రాజాచార్, సత్యనారాయణాచార్ తదితరులు మాట్లాడుతూ బళ్లారి నగరం గురూజీ రాకతో పావనం అయిందన్నారు. అంతేకాకుండా నగరంలో చాతుర్మాస పూజలు ప్రారంభించడంతో బళ్లారిలో వర్షాలు కురుస్తాయన్నారు. చాతుర్మాస పూజలను బ్రాహ్మణులు ఒక్కరే ఆచరించాలని నియమాలు లేవని, అందరూ పాల్గొని సుఖశాంతులు పొందవచ్చన్నారు.
ఈ మాసంలో దైవ పూజ చేస్తే ఎంతో మంచిదన్నారు. అనంతరం 1008 సువిద్యేంద్ర తీర్థ స్వామీజీ మాట్లాడుతూ శ్రీ మధ్వాగత ప్రవచనాన్ని వినడంతోపాటు అందులోని సారాంశాన్ని జీవితంలో పాటిస్తే కష్టాలు తీరిపోతాయని గుర్తు చేశారు. ఏ కుటుంబంలోనైనా శాంతి సౌఖ్యాలు లేకుంటే భాగవత సారాంశాన్ని గురువులు ద్వారా వింటే కష్టాలు తీరుతాయన్నారు. చాతుర్మాస దీక్షలను ఆచరిస్తే ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. ఈ వ్రత దీక్షల సందర్భంగా వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.