బోయ్‌ఫ్రెండ్‌తో బెడ్ రూంలో కత్తితో యుద్ధం
న్యూయార్క్ : తాను ఎంతగానో ప్రేమిస్తున్న బోయ్‌ఫ్రెండ్ తనను మోసం చేస్తున్నాడని గమనించిన ఓ అమెరికన్ గర్ల్‌ఫ్రెండ్ పెద్ద ప్రణాళికనే రచించింది. అతడిని అంతమొందించాలని కుట్ర చేసి పెద్ద సమురాయ్ కత్తిని తెచ్చి పెట్టుకుంది. ఎప్పటి మాదిరిగానే నిద్రపోయే సమయానికి బెడ్ రూంలోకి వెళ్లి అందులో పెద్ద యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఎంతో కొంత మార్షల్ ఆర్ట్స్ పరిజ్ఞానం ఉండటంతో ఆ బోయ్‌ఫ్రెండ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎమిలీ జావియెర్, అలెక్స్ లోవెల్ అనే ఇద్దరు ప్రేమికులు. వారిద్దరు గత రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే, అలెక్స్ ప్రవర్తనలో మార్పును గుర్తించిన ఎమిలీ లోలోపల కుమిలిపోయింది. ఒకరోజు అతడి ఫోన్లో డేటింగ్ యాప్ టిండర్‌ను గుర్తించింది. అలాగే, అతడి వీపు వెనుక భాగంలో గోర్లతో రక్కిన చారలు గుర్తించింది. పైగా ఆమె స్నానం చేసే బాత్ రూంలో ఎరుపు వర్ణంతో ఉన్న వెంట్రుకలను గుర్తించింది. అయితే, ఆమె వెంట్రుకలు లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటాయి. దాంతో రగిలిపోయిన ఎమిలీ.. తన బోయ్‌ఫ్రెండ్ రహస్యంగా మోసం చేస్తున్నాడని మండిపోయింది. అతడికి తెలియకుండా ఒక పెద్ద సమురాయ్ కత్తిని కొనుగోలు చేసింది. అతడికి అనుమానం రాకుండా బెడ్రూంలో బెడ్ కింద పెట్టింది.
చాలా సేపు ఇద్దరు కబుర్లు చెప్పుకొని ఆ రోజు నిద్రలోకి జారుకున్నారు. అయితే, నిద్రపోయినట్లుగా నటించిన ఎమిలీ చీకట్లోనే కత్తిని బయటకు తీసింది. తన టార్గెట్ మిస్సవకూడదని, ఎట్టి పరిస్థితుల్లో అతడు చనిపోవాలని నిర్ణయించుకొని తన సెల్లో లైట్‌ను ఆన్ చేసింది. సరిగ్గా వేటు వేసే సమయానికి అతడు నిద్ర లేచాడు. అప్పటికే ఆమె కత్తితో దాడి చేయడం మొదలుపెట్టింది. అప్పటికే పలు వీడియో గేమ్స్‌లలో మార్షల్ ఆర్ట్స్ చూడటం, మార్షల్ ఆర్ట్స్ సినిమాలంటే తనకు ఇష్టం ఉండటంతో అలెక్స్ ఆమెను నిలువరించే ప్రయత్నం చేశాడు.
గాయాలతోనే ఆమెను ఓసారి గట్టిగా హత్తుకొని, ఆమె కళ్లలోకి చూస్తూ 'నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను.. ఎందుకిలా చేస్తున్నావు' అంటూ ఏడ్చేశాడు. అయినా ఎమిలీ జాలీ చూపలేదు. దీంతో ఏదోలాగా కష్టపడి అతడు ఎమెర్జెన్సీకి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అలెక్స్ పొట్టలోకి కత్తిని కూడా ఆమె దింపేసింది. అలెక్స్ రెండు చేతి వేళ్లు తెగిపోయి బెడ్‌పై పడిపోయి ఉన్నాయి. ఈ సంఘటన ఈ నెల 3న చోటు చేసుకోగా అదృష్టం కొద్ది అతడు ప్రస్తుతం ప్రాణాలతో బయటపడ్డాడు.