షి‘కారు’కు ‘తమ్ముళ్ల’ తహతహ!
⇒ టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు
⇒రంగం సిద్ధం చేసుకున్న ఎమ్మెన్, సింగిరెడ్డి త్వరలో చేరిక
సాక్షి,సిటీబ్యూరో: టీడీపీ అగ్రనాయకులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఎన్ని ఆశలు చూపుతున్నప్పటికీ టీఆర్ఎస్లోకి వెళ్లేవారిని నిలువరించలేకపోతున్నారు. రోజురోజుకు వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. పార్టీ జిల్లా శాఖ సెక్రటరీజనరల్ ఎమ్మెన్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ పాలకమండలి హయాంలో పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించిన సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తమ అనుచరులు, పలువురు మాజీ కార్పొరేటర్లతో కలిసి టీఆర్ ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకుగాను శనివారం వాణిజ్యపన్నులశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిశారు. వారి చేరికకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వారు ఎప్పుడు చేరేదీ సోమవారం ఖరారు చేయనున్నారు.
టీఆర్ఎస్సా.. టీడీపీయా.. ?
టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుండటంతో టీడీపీయే టీఆర్ఎస్గా మారుతోందని టీఆర్ఎస్లో చేరబోతున్న ఓ నాయకుడు అభివర్ణించారు. ‘టీఆర్ఎస్లో ఉన్నదంతా ఎవరు.. మా వాళ్లేగా .. ’అంటూ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నగరం నుంచి పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరడం తెలిసిందే. అప్పుడు టీడీపీలో టిక్కెట్లు దొరకక కొందరు.. స్థానికంగా టిక్కెట్లనాశించే వారు ఎక్కువై కొందరు.. స్థానికంగా ఉన్న విభేదాల దృష్ట్యా కొందరు టీఆర్ఎస్లోకి వెళ్లారు.
అప్పట్లో తమతో విభేదాలున్నవారే తిరిగి ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్లో చేరుతుండటంతో రాబోయే రోజుల్లో తమకు మళ్లీ విభేదాలు తప్పవా.. ? ఈ తలనొప్పులు తమకు ఎల్లకాలం ఉండాల్సిందేనా అని ఆయా నియోజకవర్గాల్లోని నేతలు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఇప్పుడు కొత్తగా చేరుతున్న వారికే ప్రాధాన్యం లభించనుందనే ప్రచారం జరుగుతుండటాన్నీ వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
టీడీపీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బహిరంగ ప్రకటనలే కాక ఉద్యమకారులను అడ్డుకున్నవారు.. బతికినంతకాలం టీడీపీలోనే ఉంటామన్న వాళ్లు సైతం ఇప్పుడు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుండటంతో రాజకీయవర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.