నీలకంఠుని రథోత్సవం.. భక్తజన పరవశం
ఎమ్మిగనూరు/టౌన్: హరోంహర.. భక్తజన సంరక్షక నామస్మరణతో ఎమ్మిగనూరు పట్టణం మారుమ్రోగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణ.. మంగళవాయిద్యాల నడుమ సాగిన శ్రీ నీలకంఠేశ్వరస్వామి రథోత్సవం భక్తజన సంద్రంగా మారింది. అశేష భక్తుల హర్షధ్వానాల మధ్య జాతర సంబరం అంబరాన్నంటింది. బుధవారం సాయంత్రం 5.55 గంటలకు మొదలైన మహా రథోత్సవంలో 2లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో కొలువైన నీలకంఠునికి పురోహితులు విశిష్ట పూజలు నిర్వహించారు.
అనంతరం తేరుబజారు వరకు ఉత్సవమూర్తి ముక్కంటిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామిని పీఠంపై అధిష్టింపజేసి హోమం చేపట్టారు. పూర్ణకుంభంతో స్వామికి నైవేద్యం సమర్పించి హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని మహారథంపై అధిష్టింపజేసి హారతిపట్టారు. ఆ తర్వాత భక్తజనుల శివనామ స్మరణ నడుమ రథం కనులపండువగా ముందుకు కదిలింది.
రథం లాగి స్వామి కృపకు పాత్రులయ్యేందుకు భక్తులు పోటీ పడ్డారు. రథోత్సవం శ్రీవూర్కండేయుస్వామి ఆలయుం వరకు చేరుకోగానే స్వామికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మహారథాన్ని తిరిగి యథాస్థానానికి చేర్చారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
విశిష్ట పూజా ఘట్టాలు, నందికోళ్ల సేవ , గొరవయ్యల నృత్యాలు, కోలాటాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రవూలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు సీఐ శ్రీనివాసమూర్తి, పట్టణ ఎస్ఐ ఇంతియాజ్‌బాషా నేతృత్వంలో దాదాపు 600 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రథోత్సవంలో ప్రవుుఖులు
నీలకంఠేశ్వరస్వామి రథోత్సవంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మిగనూరు జూనియర్ సివిల్ జడ్జి రవిశంకర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజశేఖర్‌గౌడ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ ఎర్రకోట జగన్మోహన్రెడ్డి, మంత్రాలయం మాజీ ఎంపీపీ సీతారామిరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్లు వై.రుద్రగౌడ్, పార్థసారధిరెడ్డి, లక్ష్మీకాంత్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనారాయణరెడ్డి, కోడుమూరు సర్పంచ్ సి.బి.లత, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బి.టి.నాయుడు, తిక్కారెడ్డి, పారిశ్రామికవేత్త బుట్టా నీలకంఠప్ప, మునిసిపల్ చైర్పర్సన్ సాయ సరస్వతి, వైస్ చైర్మన్ వైపీఎం కొండయ్యచౌదరి, వైఎస్సార్సీపీ నాయకులు బుట్టా రంగయ్య, భీమిరెడ్డి, రెడ్డి పురుషోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.