విమానంలోకి ఇంత పెద్ద నెమలా?
న్యూజెర్సీ, అమెరికా : కుక్క, పిల్లి తదితర పెంపుడు జంతువులను యజమానులు తమతో పాటు ఊర్లకు తీసుకెళ్లడం మన అందరం చూశాం. నెమలిని పెంచుకుంటున్న ఓ మహిళ దాన్ని కూడా ఊరికి తీసుకెళ్దామని ఎంచక్కా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చేసింది. ఇందుకోసం నెమలికి సైతం ప్రత్యేకంగా టికెట్‌ను కూడా తీసింది.
ఈ ఘటన నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. అయితే, నెమలి విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థ ఒప్పుకోలేదు. గత నెలలో అమెరికాకు చెందిన విమానయాన సంస్థలు పెట్స్‌ను క్యారీ చేయడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి. దీంతో నెమలికి కూడా ప్రత్యేకంగా టికెట్ తీసుకున్నానని, దయచేసి దాన్ని కూడా ప్రయాణించనివ్వాలన్న మహిళ అభ్యర్థనను ఎయిర్‌లైన్స్ ఉద్యోగులు తోసిపుచ్చారు.
దీంతో ‘ఎమోషనల్ సపోర్ట్ యానిమల్’ నిబంధనల ప్రకారం తన పక్షిని విమానంలో తీసుకెళ్లే హక్కుందని మహిళ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులతో వాదనకు దిగారు. ఈ సంఘటన మొత్తాన్ని చిత్రీకరించిన ఓ వ్యక్తి సదరు మహిళ, నెమలి ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దీంతో అవి ఫోటోలు వైరల్ అయ్యాయి. ‘ఎమోషనల్ సపోర్ట్ ఎనిమల్’ షరతులతో నెమలి ప్రయాణించడం సాధ్యం కాదని ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు.
నెమలి ఆకారంలో, బరువులో నిబంధనలకు మించి ఉందని వెల్లడించారు. ఇదిలావుండగా అంతపెద్ద సైజు ఉన్న నెమలి విమాన సీట్లో ఎలా పడుతుందని?, టికెట్లో నెమలి పేరును ఏం రాశారని?, ఎమోషనల్ సపోర్ట్ పికాక్ ఎక్కడ దొరుకుతుందంటూ? నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.