మా వేతనాలు పెంచండి
ఈజీఎంఎం జాబ్ రిసోర్స్ పర్సన్ల డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఎంప్లాయి మెంట్ గ్యారంటీ అండ్ మార్కె టింగ్ మిషన్ (ఈజీఎంఎం)లో పనిచేసే ఉద్యోగులకు దాదాపు పదేళ్లుగా వేతనాలు పెంచడం లేదని, దీంతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నామని ఈజీఎంఎం జాబ్ రిసోర్స్ పర్సన్లు వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో పనిచేస్తున్న జేఆర్పీలు సోమవారం హైదరాబాద్లోని ఈజీఎంఎం కార్యాలయాన్ని ముట్టడించారు. చిరుద్యోగుల పట్ల ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఈజీఎంఎం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మధుకర్బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశంపై ఈడీ మధుకర్బాబును ‘సాక్షి’వివరణ కోరగా... జీతాల పెంపు ఆర్థికపరమైన అంశం కనుక పాలకమండలి ఆమోదం తప్పనిసరని చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో పాలకమండలి సమావేశం జరిగే అవకాశం ఉందని, పాలకమండలి సూచనల మేరకు జేఆర్పీల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.