హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాస
సచివాలయ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సమావేశం రసాభాసగా మారింది. అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయాలంటూ ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే, కోరం లేదు కాబట్టి సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే అది కుదరదని సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు అన్నారు.
దీంతో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. వారికి పోటీగా సీమాంధ్ర ఉద్యోగులు జై సమైక్యాంధ్ర అంటూ నినదించారు. పోటాపోటీ నినాదాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశాన్ని వాయిదా వేశారు.